Share News

వేరుశనగ విత్తనాల్లో డొల్ల

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:46 PM

రబీలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాల్లో డొల్లతనం బయటపడుతోంది. అధికశాతం డొల్ల కాయ లు ఉండడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు.

వేరుశనగ విత్తనాల్లో డొల్ల
రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ(ఫైల్‌) ఇన్‌సెట్‌లో డొల్ల విత్తనాలు

- రైతు సేవాకేంద్రాలకు నాసిరకం కాయలు

- ఆందోళన చెందుతున్న రైతులు

నరసన్నపేట, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రబీలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాల్లో డొల్లతనం బయటపడుతోంది. అధికశాతం డొల్ల కాయ లు ఉండడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వేరుశనగ పప్పు కూడా చేదుగా ఉండడంతో వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది నూనె గింజల సాగు పెంచాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ అధికారులు నువ్వులు, వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రబీలో టెక్కలి, నరసన్నపేట వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మండలాల్లో వేరు శనగ ఎక్కువగా సాగవుతోంది. 79,397 హెక్టార్లులో సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నరసన్నపేట, పోలాకి, నందిగాం, మెళియపుట్టి, పాతపట్నం తదితర మండలాల్లో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తారు. జిల్లాలో 6,5 43 క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే నరసన్నపేట మండలం జమ్ము, తామరాపల్లి రైతు సేవా కేంద్రాలకు గత వారంలో 130.20క్వింటాళ్ల వేరుశ నగ విత్తనాలు పంపిణీ చేశారు. 30 కేజీల బస్తాలో సగానికిపైగా డొల్ల కాయలే ఉన్నాయని ఆయా గ్రామాల రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు చిరుచేదుగా ఉండటంతో మొలకపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వరి కోతలు సాగుతు న్నాయి. మరో 15 రోజుల్లో వేరుశనగ వేసేందుకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. సబ్సిడీ విత్తనాల్లో నాణ్యత తక్కువగా ఉందని వారు చెబుతున్నారు. 100 గ్రాముల వేరుశనగ కాయలను పొట్టుతీస్తే 70 గ్రాముల పప్పు వస్తే మంచిది. అయితే రైతు సేవాకేంద్రాల్లో 30 కేజీల వేరుశనగ పొట్టు తిస్తే 15 కేజీల విత్తనాలు మాత్రమే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అంటే 50 శాతం మాత్రమే దిగుబడి వస్తున్నాయని, కొన్ని ఆర్‌ఎస్‌కేలకు పంపిణీ చేసే విత్తనాలు 60 గ్రాముల వరకు దిగుబడి వస్తున్నాయని చెబుతున్నారు. పుచ్చిన విత్తనాలు, డొల్ల విత్తనాలు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు.

30 కేజీలు బస్తాకు 15కేజీలు పప్పు: కొత్తరెడ్డి బుసిమ్మ, జమ్ము

రైతు సేవాకేంద్రాల్లో పంపిణీ చేసే వేరుశనగ 30 కేజీల బస్తా తీసుకున్నాను. మిషన్‌ మీదకాకుండా చేతులు ద్వారా పొట్టు తీస్తే.. ఎక్కువగా డొల్ల కాయిలు ఉన్నాయి. వీటితో పాటు పుచ్చిన పప్పు కూడా ఎక్కువగా వచ్చింది. దిగుబడి 50 శాతంమే అంటే 15 కేజీల పప్పు వచ్చింది. ప్రభుత్వం రాయితీ ఇచ్చినా ఏం ప్రయోజనం?

..........

మెలకలపై అనుమానంగా ఉంది: రెడ్డి శ్రీనివాసరావు

వేరుశనగ విత్తనాలు చిరుచేదుగా ఉన్నాయి. మొలకశాతం ఎలా ఉంటుందో పొలం వేస్తేగానీ తెలియదు. బస్తాల్లో డొల్లకాయలు ఎక్కువగా వస్తున్నాయి. మొలకలు రాకుంటే ఇబ్బంది పడతాం. ముందుగానే పరీక్షించి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తే బాగుండేది.

.............

పరీక్షించి పంపిణీ చేశాం: కె.త్రినాథస్వామి, జేడీఏ

రబీలో ఈఏడాది రాష్ట్రంలో ముందుగా జిల్లాలోనే సబ్సిడీ వేరుశనగ పంపిణీ చేశాము. సీడ్స్‌ కేంద్రంలో విత్తనాల నాణ్యత, మొలకశాతం పరీక్షించిన తర్వాత జిల్లాలకు పంపిణీ చేశారు. మార్కెట్‌లో కన్నా కిలోకు రూ.45 నుంచి రూ.50 తక్కువగా పంపిణీ చేస్తున్నాం. నాణ్యత తక్కువగా ఉంటే తిరిగి ఇస్తే వేరే విత్తనాలు ఇస్తాం .

Updated Date - Nov 16 , 2024 | 11:46 PM