Share News

దాహం.. దాహం!

ABN , Publish Date - Apr 09 , 2024 | 12:19 AM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మునిసిపల్‌ సమావేశాల్లో కౌన్సిలర్లు నిలదీస్తున్నా.. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదనే ఆరోపణలున్నాయి.

దాహం.. దాహం!
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిలో అడుగంటిన బావి

- పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో తాగునీటికి ఇబ్బందులు

- సమగ్ర మంచినీటి పథకం ఉన్నా.. నిష్ప్రయోజనం

- ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటి సరఫరా

(పలాస)

- రెండేళ్ల నుంచి తాగునీటి బోర్లు, బావులు, పైలెట్‌ వాటర్‌స్కీమ్‌లు బాగుచేసి ప్రజలకు నీరందించాలని కోరుతున్నా పాలకులు ఎందుకు స్పందించడం లేదు?

- బోర్లు, పైలెట్‌ వాటర్‌స్కీమ్‌లు మంజూరై రెండేళ్లవుతున్నా ఎందుకు వాటిని వేయడం లేదు. ప్రజలంటే అంత చులకనా?. కనీసం సమగ్ర తాగునీటి పథకంలోనైనా తీసి నీరు ఇవ్వండి.

- ప్రతి మునిసిపల్‌ సమావేశంలోనూ 27, 29వ వార్డుల కౌన్సిలర్లు గురిటి సూర్యనారాయణ, జోగ త్రివేణి అధికారులకు వేసే ప్రశ్నలివీ. ప్రతిపక్ష, విపక్ష నేతలు సైతం తాగునీటి కోసం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికారులు నిస్సహాయస్థితిని వ్యక్తం చేయడం తప్ప.. సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. దీంతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో దాహం కేకలు ప్రభుత్వానికి వినిపించవంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

...................................

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మునిసిపల్‌ సమావేశాల్లో కౌన్సిలర్లు నిలదీస్తున్నా.. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదనే ఆరోపణలున్నాయి. పది నెలలుగా వర్షాలు లేక భూగర్భ జలాలన్నీ ఇంకిపోయాయి. గతంలో వంద అడుగులు బోర్‌ తవ్వితే నీరు రాగా.. ప్రస్తుతం 300 అడుగులు లోతు కొడితే నే తప్ప నీరు రాని పరిస్థితి నెలకొంది. మునిసిపాలిటీకి తాగునీరు అందించేందుకు వంశధార ఆధారిత బావులు ఐదు నిర్మించగా.. నీరు రాకపోవడంతో ఆ బావులన్నీ ఎండిపోయాయి. ప్రత్యామ్నాయంగా పారసంబ గ్రామం పొలాల్లో బోర్లు తవ్వి అక్కడ నుంచి అరకొరగా నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మునిసిపల్‌ ప్రజల అవసరాల కోసం ఇంటింటా కుళాయిల ద్వారా వారానికి ఒక రోజు నీరు అందిస్తున్నారు. దాతలు, మునిసిపల్‌ అధికారులు స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకోసారి నీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో హడ్కోకాలనీ, సూదికొండకాలనీ, సాయిబులకాలనీ, శివాజీనగర్‌, పురుషోత్తపురం, ఉదయపురం, హరిజనవీధి, శాంతినగర్‌కాలనీ, తాళభద్ర, నర్సిపురం, పెంటవీధి, డెంకివీధి, నెహ్రూనగర్‌, శ్రీనివాసనగర్‌ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. 500 అడుగుల లోతులో బోర్లు వేస్తే తప్ప నీరు రాని పరిస్థితి. ఇంటింటా కుళాయిలు, పబ్లిక్‌ కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరే ప్రస్తుతం ఈ ప్రాంత వాసులకు ఆధారం. దీంతో ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి గత అక్టోబరు నుంచే నీటి కష్టాలు ప్రారంభం కాగా.. అధికారులు ముందు చూపుతో ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. ప్రస్తుతం మునిసిపాలిటి అంతా నీటి కష్టాలు తీవ్రం కావడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

ముంచిన ఆఫ్‌షోర్‌ ఆధారిత తాగునీటి పథకం

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి పలాస మండలం రేగులపాడు వద్ద నిర్మించే ఆఫ్‌షోర్‌ జలాశయం ద్వారా నీరు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.110 కోట్ల వ్యయంతో సమగ్ర ప్రణాళిక వేసింది. రిజర్వాయర్‌ నిర్మాణం ఆలస్యం కావడంతో మరే ఇతర పథకాలు మునిసిపాలిటీకి వర్తించడం లేదు. దీనిపై ఎన్ని ప్రతిపాదనలు పంపించినా ఆఫ్‌షోర్‌ కారణంగా ఉన్నతాధికారులు మౌనం దాల్చుతున్నారు.

మునిసిపాలిటిపై నుంచే ఇతర గ్రామాలకు నీరు:

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎంతో ఆర్భాటంగా సమగ్ర మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తూ తాగునీటి సమస్యలు తీరిపోయాయని సెలవిచ్చారు. వాస్తవానికి రూ.700కోట్ల వ్యయంతో నిర్మించిన మంచినీటి పథకం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పైనుంచే ఇచ్ఛాపురం నియోజకవర్గం వరకూ వెళ్తుంది. కానీ జంటపట్టణ ప్రజల దాహార్తిని మాత్రం తీర్చడం లేదు. అధికారులు చొరవ చూపి ఈ పైపులైన్లు మునిసిపాలిటీ మంచినీటి పథకానికి కలిపితే.. జంట పట్టణాల్లో తాగునీటి సమస్య తీరుతుంది. కనీసం ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రారంభమయ్యే వరకైనా నీటిని విడుదల చేస్తే తమకు ఇబ్బందులు ఉండవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.సమగ్ర మంచినీటి పథకాన్ని మునిసిపాలిటీకి కూడా వర్తించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- ఈ వ్యవహారంపై కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌ను వివరణ కోరగా ప్రత్యామ్నాయంగా మునిసిపల్‌, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. బోరుబావుల్లో నీరు నింపి మూడురోజులకోసారి కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. నీటిని వృధా చేయకుండా ప్రజలు వినియోగించాలని సూచించారు.

Updated Date - Apr 09 , 2024 | 12:19 AM