Share News

సాగునీటి సంఘాలకు ఎన్నికలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:49 PM

ఎట్టకేలకు సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

సాగునీటి సంఘాలకు ఎన్నికలు

- నవంబరు 21 నుంచి 27 వరకు ప్రక్రియ

- ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు

- నోటిఫికేషన్‌ను జారీచేసిన చేసిన కలెక్టర్‌

శ్రీకాకుళం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గత ప్రభుత్వం ఆయకట్టు సంఘాలను నిర్వీర్యం చేసేసింది. సాగునీటి రంగం ప్రాధాన్యం లేని విషయంగా భావించింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఇటీవలే కూటమి ప్రభుత్వం ఆయకట్టు సంఘాల ఎన్నికలపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలకు గాను నోటిఫికేషన్‌ జారీ చేసింది.

- జిల్లాలో 344 సాగునీటి సంఘాలు...

జిల్లావ్యాప్తంగా 344 సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీటికి గాను అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. భారీ, మధ్యతరహా, చిన్ననీటి పారుదల సంఘాల పరిధిలో ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు ప్రారంభించారు. గతంలో నిర్ధారించిన ఆయకట్టు కింద ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితా ఆధునికీకరించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఆయకట్టు పరధిలో వాస్తవ సాగుదారుడెవరన్న వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. రైతుల ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఇతర అన్ని అభ్యంతరాలను పరిశీలించాక తుది జాబితాను నవంబరు 13న ప్రచురిస్తారు. నవంబరు 21 నుంచి 27 వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. సోమవారం నుంచి నలభై రోజులపాటు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. సాగునీటి సంఘాల పరిధిలోని పంట కాలువల అభివృద్ధి, నీటి సరఫరా తీరుతెన్నులు పర్యవేక్షించడంతోపాటు ఆయకట్టు పరిధిలో ఏ సమస్య వాటిల్లినా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. టీడీపీ హయాంలో 2015లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరగ్గా.. మళ్లీ ప్రస్తుత కూటమి పాలనలో వీటిని నిర్వహించడం గమనార్హం.

Updated Date - Oct 21 , 2024 | 11:49 PM