Share News

కాలం చెల్లిన మందులే

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:43 PM

ఆయుర్వేద వైద్యంతో ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధులు నయమవుతాయని కొంతమంది ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

కాలం చెల్లిన మందులే

- ఆయుర్వేద దుకాణాల్లో నిబంధనలు తూచ్‌

- ఇష్టానుసారంగా విక్రయాలు..

- అసలువో.. నకిలీవో ఎవరూ పోల్చలేని వైనం

- విజిలెన్స్‌ అధికారుల తనిఖీలో బయటపడిన అక్రమాలు

శ్రీకాకుళం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద వైద్యంతో ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధులు నయమవుతాయని కొంతమంది ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. కాలం చెల్లిన మందులు, నకిలీవి విక్రయించి.. రోగులను దోచుకుంటున్నారు. అధికారులు ఏడాదికి ఓసారైనా తనిఖీలు చేపట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాగా.. ఇటీవల ఈ దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. తనిఖీల్లో అక్రమాలు బయటపడడం చర్చనీయాంశమవుతోంది.

- రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 27 వరకు ఆయుర్వేద ముందుల దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళంలోని నెహ్రూ రోడ్‌లో రెండు దుకాణాల్లో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మందులను విక్రయిస్తున్నారు. ఈ రెండు దుకాణాల్లో విజిలెన్స్‌ డ్రగ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చంద్రరావు, విజిలెన్స్‌ సీఐ సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ రామారావు బృందంగా ఏర్పడి ఇటీవల సోదాలు నిర్వహించారు. రెండు దుకాణాల్లోనూ కాలం చెల్లిన మందులు కొన్ని లభించాయి. ఫిజీషియన్‌ శాంపిల్స్‌ కనిపించాయి. వీటిని సీజ్‌ చేశారు. అలాగే వినియోగదారులు కొనుగోలు చేస్తున్న మందులకు బిల్లులు ఇవ్వకపోవడాన్ని గుర్తించారు. దీనిపై రాష్ట్ర అధికారులకు నివేదిక పంపారు. ఈ వ్యవహారంపై కార్పొరేషన్‌, ఆహార కల్తీనియంత్రణ, ఆయుష్‌ అధికారులు చర్చించి.. రెండు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు.

- ఏడాదికోసారైనా తనిఖీలు లేవు

ఇటీవల ప్రతి మండలం.. పట్టణాల్లోనూ ఆయుర్వేద మందుల దుకాణాలు వెలుస్తున్నాయి. అయితే ఈ దుకాణాల్లో విక్రయిస్తున్న మందుల నాణ్యత విషయం దేవుడికే ఎరుక. ప్రముఖ ఆయుర్వేద బ్రాండ్‌లకు చెందిన హిమాలయ, చరక్‌, బైద్యనాథ్‌, ఆయుర్‌, పతాంజలి.. సంస్థలకు చెందిన ఆయుర్వేద మందులను కొనుగోలు చేయాలన్నా.. కచ్చితంగా క్వాలిఫైడ్‌ ఆయుర్వేద వైద్యులే సూచించాలి. వారే మందుల చీటీ రాయాలి. కానీ జిల్లాలో ఇది ఎక్కడా అమలుకావడం లేదు. దుకాణాల నిర్వాహకులే.. ‘సంప్రదాయ వైద్యం’ అంటూ మందులు విక్రయిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులతోనూ కుమ్మక్కవుతున్నారు. రోగులను తమ దుకాణాలకే పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదికోసారైనా అధికారులు దుకాణాల్లో తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అక్కడ విక్రయిస్తున్న మందులు.. నిల్వచేస్తున్న పద్ధతులను కూడా ఆయుష్‌ కమిషనర్‌ స్థాయిలో చర్చ జరగడంలేదు. జిల్లాకు ఓ అధికారి అంటూ ఆయుర్వేద మందుల దుకాణాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎవరూ లేకపోవడంతో.. నిర్వాహకుల ఇష్టారాజ్యం సాగుతోంది. వినియోగదారుడు కొనుగోలు చేసిన మందులకు బిల్లులూ ఇవ్వడం లేదు. పైగా.. దుకాణాల్లో వినియోగించే తూనిక యంత్రానికి కూడా లైసెన్స్‌(లీగల్‌ మెట్రాలజీ నుంచి) లేకపోవడం దారుణం. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఆహారకల్తీనియంత్రణ అధికారులు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, లీగల్‌ మెట్రాలజీ.. వంటి శాఖలన్నీ తరుచూ ఆయుర్వేద దుకాణాలపై నిఘా సారిస్తే.. వాటి వెనుక అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం ఆయుర్వేద దుకాణాల్లో విక్రయిస్తున్న మందులు ఇటు అల్లోపతి కంటే హెచ్చుమీరిన ధరలున్నా.. కొంతమంది నమ్మకంతో వాడుతున్నారు. మందుల్లో నాణ్యత పరీక్షలు జరగాలని... కంపెనీల మందులను అధికారులు పరిశీలించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:43 PM