Share News

పెట్రోల్‌ బంక్‌లో.. మంటలు

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:09 AM

టెక్కలిలోని పాత జాతీయ రహదారి ఆదీఆంధ్రా వీధి వెనుక ఉన్న భారత్‌ పెట్రోలియం బంక్‌లో గురువారం ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళన చెందారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పెట్రోల్‌ బంక్‌లో.. మంటలు
పెట్రోల్‌బంకును పరిశీలిస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి, అధికారులు

- త్రుటిలో తప్పిన ముప్పు

- షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమంటున్న బంకు యాజమాన్యం

- ఆ అవకాశమే లేదంటున్న విద్యుత్‌శాఖ అధికారులు

- కానరాని నిబంధనలు

టెక్కలి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని పాత జాతీయ రహదారి ఆదీఆంధ్రా వీధి వెనుక ఉన్న భారత్‌ పెట్రోలియం బంక్‌లో గురువారం ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళన చెందారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని బంక్‌ యాజమాన్యం చెబుతోంది. కాగా.. ఆ అవకాశం లేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

- బీపీసీఎల్‌ ఆధ్వర్యంలో గుంటూరు ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు కామినేని రవిశంకర్‌ పేరుతో ఈ బంకు నడుస్తోంది. తాజాగా మహేష్‌ అనే వ్యక్తి ఈ బంకును తన పేరున బదిలీ కోసం బీపీసీఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఉదయం 8.30గంటల సమయంలో ఈ బంకులో ఓ పంపు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ సిబ్బంది, పెట్రోల్‌ కోసం వచ్చే వాహనదారులు ఒక్క ఉదుటున పరుగులు పెట్టారు. మంటలు ఆర్పేందుకుగానూ బంక్‌లోని ఫైర్‌సేఫ్టీ సామగ్రి వినియోగించేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. అవి కొన్ని పనిచేయలేదు. ఒకటి, రెండు ఫైర్‌ సామగ్రి కూడా మంటలకు కాలిపోయాయి. హుటాహుటిన అక్కడున్న సిబ్బంది.. టెక్కలి నాలుగురోడ్లు కూడలిలో ఉన్న మరో పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లి ఫైర్‌సేఫ్టీ సామగ్రి తెచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బంకులో అగ్ని ప్రమాదం జరిగే సమయానికి 2,600లీటర్ల పెట్రోల్‌, ఎనిమిదివేల లీటర్ల డీజల్‌ ఉందని సిబ్బంది తెలిపారు.

- ప్రస్తుతం ఈ బంకులో అదనంగా చెరో 20కేఎల్‌ ట్యాంకులు పెంచాలనే యోచనతో బీపీసీఎల్‌ కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో సంబంధిత పైపులైన్‌ పనులు చేస్తున్నారు. వెల్డింగ్‌ నిప్పురవ్వలు తుల్లి మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వలనే ఈ సంఘటన చోటుచేసుకుందని బంకు నిర్వాహకుడు మహేష్‌ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పంపులకు సంబంధించి డిస్కనెక్ట్‌ చేసే పనులు చేయిస్తున్నామన్నారు.

- అధికారుల పరిశీలన

రెవెన్యూ అధికారులు, పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి పరిశీలించారు. బీపీసీఎల్‌ సేల్స్‌ ఆఫీసర్‌ అన్విత, కాంట్రాక్టర్‌ పనులు నిర్వహిస్తున్న సిబ్బంది, బంకు తాత్కాలిక యజమాని మహేష్‌తో మాట్లాడారు. ప్రమాద సంఘటన, ఆయిల్‌ నిల్వలు అంశాలపై ఆరాతీశారు. సీఐ విజయ్‌కుమార్‌, సీఎస్‌డీటీ అనిల్‌కుమార్‌ పాత్రో, అగ్నిమాపకశాఖ అధికారి కూర్మారావుతో చర్చించారు. ఈ ప్రాంతంలోని సీసీ కెమేరాల ఫుటేజ్‌లను పరిశీలించి.. తనకు వివరాలు తెలియజేయాలని తెలిపారు.

- నిబంధనలు ఉల్లంఘించి..

వాస్తవానికి ఈ బంకు విస్తీర్ణం చాలా చిన్నది. ఒకటి, రెండు గ్రానైట్‌ వాహనాలు, ఇతర లారీలు లోపలకు వెళితే తిరగడానికి అతికష్టమవుతుంది. ఇంత చిన్న ప్రదేశంలో ఇప్పటికే 20కేఎల్‌, 15కేఎల్‌ డీజల్‌, 20కేఎల్‌, 15కేఎల్‌ పెట్రోల్‌ ట్యాంకులు ఉన్నాయి. టెక్కలిలో చాలాకాలంగా ఈ బంకు నడుస్తోంది. విక్రయాలు బాగుండడంతో ఈ ఇరుకు ప్రదేశంలోనే అదనంగా చెరో 20కేఎల్‌ పెట్రోల్‌, డీజల్‌ ట్యాంకులు అమర్చే కార్యక్రమం బీపీసీఎల్‌ కాంట్రాక్టర్లు చేపట్టారు. ట్యాంకు పనులు జరిగేటప్పుడు పెట్రోల్‌ బంకులు మూసివేసి ట్యాంకులను అమర్చాలి. కానీ ఇక్కడ బంక్‌ మూయకుండా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తూనే.. మరోవైపు కొత్త ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే ఫైర్‌సేఫ్టీ ఎన్‌వోసీ లేకుండా ప్రొవిజినల్స్‌తోనే కాలం గడుపుతున్నారు. ఈనెల 30తో దాని కాలపరిమితి కూడా ముగియనుందని ఫైర్‌ అధికారి తెలిపారు. ఈ పెట్రోల్‌ బంకు సమీపంలో ఇంజన్‌ఆయిల్‌ దుకాణాలు, వెనుక ఎస్సీ కాలనీ, దగ్గర్లో సినిమాహాల్‌, కళ్యాణ మండపం, పలురకాల ద్విచక్రవాహనాల దుకాణాలు, ఇతర షాపులు ఉన్నాయి. వీటికి తోడు ఈ బంకు ప్రాంగణంలో మూడు నుంచి ఐదువేల లీటర్ల ఆయిల్‌ డోర్‌డెలివరీ తరహాలో బీపీసీఎల్‌ పేరుతో మినీ ట్యాంకరు ఒకటి ఉంది. తెలంగాణా రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న ఈ మినీట్యాంకర్‌ నిర్వహణకు బీపీసీఎల్‌ అనుమతి ఉందా, లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే నెంబరు లేని పాత ట్యాంకు వాహనంతో కూడా డీజిల్‌ విక్రయాలు చేయడంలో ఈ బంకు యాజమాన్యం ముందువరుసలో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బంకులో మంటలు వ్యాపించగా.. యాజమాన్యం అక్కడున్న ట్యాంకర్లను అధికారులు రాకముందే ఇతర ప్రాంతాలకు తరలించడం విశేషం.

- తడబాటు ఎందుకో?

బంకులో మంటలు చెలరేగాయనే సమాచారం ఎలా వచ్చిందని అగ్నిమాపకశాఖ అధికారి కూర్మారావు వద్ద ప్రస్తావించగా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ద్వారా తెలుసుకున్నానన్నారు. కాగా.. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ చాలా రోజుల నుంచి పనిచేయడం లేదు కదా? అని ప్రశ్నించగా.. ఆయన తడబడ్డారు. చివరకు లోకేశ్‌ అనే వ్యక్తి నుంచి సమాచారం అందిందని తెలిపారు. అక్కడ ఫైర్‌సేఫ్టీ సామగ్రి ఉందా? అని అడగ్గా.. ఉందన్నారు. పక్క బంకు నుంచి కూడా కొంత సామగ్రి తెచ్చి మంటలు అదుపు చేశామన్నారు. ఫైర్‌సేఫ్టీ మెజర్స్‌ పనిచేయకపోవడాన్ని గుర్తించామని తెలిపారు.

- తొంగిచూడని బీపీసీఎల్‌ అధికారులు :

వాస్తవానికి నెలలో రెండుసార్లయినా సంబంధిత పెట్రోల్‌ బంకులను బీపీసీఎల్‌ అధికారులు పరిశీలించాలి. సేల్స్‌మేనేజర్‌గా ఉన్న అన్విత ఇవేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బంకుల్లో ఓవైపు పెట్రోల్‌, డీజల్‌ అమ్మకాలు జరుగుతుండగా, మరోవైపు ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణ పనులకు ఎలా అంగీకరించారో బీపీసీఎల్‌ అధికారులకే తెలియాల్సి ఉంది. బంకుల్లో ఏమి జరుగుతుందో గుర్తించేందుకు డీఎస్‌వో, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

షార్ట్‌సర్క్యూట్‌ కానేకాదు :

పెట్రోల్‌ బంకులో షార్ట్‌సర్క్యూట్‌ వలన ప్రమాదం జరిగిందని యాజమాన్యం చెప్పడం వాస్తవం కాదు. మీటరు దగ్గర కానీ, ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఫీజులు కూడా కొట్టలేదు. విద్యుత్‌ శాఖ నుంచి తప్పు జరగలేదు.

- కృష్ణమూర్తి, ఈపీడీసీఎల్‌ ఏడీ

Updated Date - Dec 20 , 2024 | 12:09 AM