Share News

ఇంట్లోనే వినోదం!

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:37 AM

ఇంటర్నెట్‌ వినియోగం, ఓటీటీ సంస్కృతి పెరిగిన వేళ.. ఇంట్లోనే భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్ల ఏర్పాటుపై జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. 90వ దశకంలో ఓ సినిమా రిలీజ్‌ అయితే థియేటర్‌ వద్ద ఉండే సందడి వేరు. ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు మార్మోగేవి. పండుగ పూట ఐదు షోలతో రోజంతా సందడే. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనీసస్థాయిలో లేదు.

ఇంట్లోనే వినోదం!

- భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్ల ఏర్పాటుపై ప్రజల ఆసక్తి

- ఊపందుకున్న ఓటీటీ సంస్కృతి

- థియేటర్లకు తగ్గుతున్న ఆదరణ

రణస్థలం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి):

రణస్థలం మండలం కొండములగాం గ్రామానికి చెందిన దన్నాన రఘు ఇంట్లో ఏర్పాటు చేసిన మినీ థియేటర్‌ ఇది(పై చిత్రం). భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌.. మంచి సౌండ్‌ సిస్టమ్‌తో థియేటర్‌లో ఉన్న అనుభూతి కలిగేలా దీనిని ఏర్పాటు చేశారు. నెట్‌ అందుబాటులో ఉండడంతో ఆ స్ర్కీన్‌పై సినిమాలే కాదు.. ఈవెంట్లు, న్యూస్‌, పిల్లల కార్టూన్‌ నెట్‌వర్క్‌.. ఇలా ఇంట్లోనే ఎన్నో చానెళ్లను చూస్తూ వినోదం పొందుతున్నారు.

.....................

ఇంటర్నెట్‌ వినియోగం, ఓటీటీ సంస్కృతి పెరిగిన వేళ.. ఇంట్లోనే భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్ల ఏర్పాటుపై జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. 90వ దశకంలో ఓ సినిమా రిలీజ్‌ అయితే థియేటర్‌ వద్ద ఉండే సందడి వేరు. ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు మార్మోగేవి. పండుగ పూట ఐదు షోలతో రోజంతా సందడే. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనీసస్థాయిలో లేదు. పెద్ద హీరోల సినిమాలైతే ఫర్వాలేదు కానీ.. చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. అసలు థియేటర్‌కు వచ్చి సినిమా చూసేవారు కరువవుతున్నారు. దీనికి సాంకేతికతంగా వచ్చిన మార్పులే కారణం. నెట్టింట్లోకి ఇప్పుడు సినిమాలు వచ్చి పడుతుండడంతో థియేటర్‌కు వెళ్లి చూసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. మరోవైపు మల్టీఫ్లెక్స్‌ వచ్చిన తరవాత సగటు సామాన్య ప్రేక్షకుడు సినిమా చూడాలంటే ఆర్థికభారంగా మారింది. ఈ నేపథ్యంలో చాలామంది ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు.

- ఇంటిల్లిపాదీ కూర్చొని..

ప్రస్తుతం ఓటీటీ సంస్కృతి నడుస్తోంది. ప్రతీ ఇంటా ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. ఓవైపు సెల్‌ఫోన్లు, మరోవైపు 40, 60 ఇంచీల టీవీలు దర్శనమిస్తున్నాయి. 4కే, 5కే క్యూ ఎల్‌ఈడీలు.. వీటికి అనుసంధానంగా ప్రత్యేక సౌండ్‌సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే ప్రత్యేక హోం థియేటర్లను సమకూర్చుకుంటున్నారు. మరోవైపు అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా, నెట్‌ ఫ్లిక్స్‌, జీ5, సోనీ లైవ్‌ వంటి 48 రకాల ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు వీటి ప్యాకేజీ అంతా రూ.1500లోపే. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు యాప్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోనే భారీ స్ర్కీన్లపై నచ్చిన చానెళ్లను వీక్షిస్తూ.. వినోదం పొందుతున్నారు. ఈ క్రమంలో థియేటర్లకు ఆదరణ తగ్గుతోంది.

- మూతపడుతున్న థియేటర్లు..

జిల్లాలో గతంలో 100 సినిమా థియేటర్ల వరకూ ఉండేవి. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఓ పది థియేటర్లు.. ఇతర పట్టణాల్లో మరో 25వరకూ మాత్రమే కొనసాగుతున్నాయి. వాటికి కూడా ప్రేక్షకాదరణ అంతంతమాత్రమే. చాలా థియేటర్లలో ప్రతిరోజూ నాలుగు షోలు వేయడం గగనంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ థియేటర్లన్నీ.. సినీ ఎగ్జిబ్యూటర్లే లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఆదరణ లేక జిల్లాలో చాలా థియేటర్లు మూతపడడంతో వీటిపై ఆధారపడే వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకుంటున్నారు. ఒక్కో థియేటర్‌లో మేనేజర్‌, థియేటర్‌ ఆపరేటర్‌, సహాయకులు, ఎలక్ర్టీషియన్‌, స్వీపర్‌, క్యాంటీన్‌ అసిస్టెంట్‌, టిక్కెట్‌ కౌంటర్‌.. ఇలా 15మంది వరకూ సిబ్బంది ఉండేవారు. కానీ ఇప్పుడు థియేటర్ల నిర్వహణ భారం కావడంతో ఏడు, ఎనిమిది మందితో పని కానిచ్చేస్తున్నారు. విద్యుత్‌ చార్జీలు పెరగడం, రాయితీలు తగ్గడం వంటి కారణాలతో థియేటర్లు మూతపడుతున్నాయి. కొన్ని పట్టణాల్లో థియేటర్లను కళ్యాణమండపాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లుగా మార్చేస్తున్నారు.

...........................

ఇంట్లోనే చూసుకుంటున్నాం..

గతంలో సినిమా రిలీజ్‌ అయిన వెంటనే థియేటర్‌కు వెళ్లి చూసేవారం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టిక్కెట్‌ ధరలు పెరగడం, సమయభావం కారణంతో కుటుంబసభ్యులు కలిసిమెలిసి వెళ్లలేని పరిస్థితి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫారానికి అలవాటు పడ్డాం. ఇంట్లోనే కుటుంబ సభ్యులమంతా ఒకే దగ్గర కూర్చోని వినోదాన్ని ఆస్వాదిస్తున్నాం.

- దన్నాన రఘు, కొండములగాం

...........................

నిర్వహణ కష్టమే..

థియేటర్‌కు ప్రేక్షకులు రావడం తగ్గుముఖం పట్టింది. కేవలం పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు కనిపిస్తున్నారు. అదీ హిట్‌ టాక్‌ వస్తేనే. ప్రధానంగా ఓటీటీ ప్లాట్‌ఫారంలు థియేటర్లను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదు.

- శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌ నిర్వాహకుల ఆవేదన

Updated Date - Dec 07 , 2024 | 12:37 AM