ముంబైకి తరలిస్తూ.. ..
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:00 AM
ఒడిశా రాష్ట్రం నుంచి ముంబైకి గంజాయి తరలిస్తూ.. ఇచ్ఛాపురంలో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 32.470 కేజీల గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
- ఇచ్ఛాపురంలో 32 కేజీల గంజాయి సీజ్
- ముగ్గురు అరెస్ట్
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 15: ఒడిశా రాష్ట్రం నుంచి ముంబైకి గంజాయి తరలిస్తూ.. ఇచ్ఛాపురంలో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 32.470 కేజీల గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఇచ్ఛాపురంలోని సర్కిల్ కార్యాలయంలో జిల్లా క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహనబ్లాక్ ఖరీగూడా గ్రామానికి చెందిన రేష్మానాయక్, సుమతి నాయక్, రాయిజుక గ్రామానికి చెందిన గజేంద్ర నాయక్.. అదే గ్రామంలోని మఘల్ నాయక్ వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. దానిని రెండు బ్యాగులు, ఒక షూట్‌కేస్‌లో సర్ది.. ముంబైకి తరలించేందుకు ఆదివారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేయగా.. 32.470 కేజీల గంజాయి నిల్వలు పట్టుబడ్డాయి. గంజాయిని సీజ్ చేసి.. ఆ ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామ’ని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపడుతున్నాం. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని రైల్వేస్టేషన్లలో పోలీసు గస్తీ పెట్టాం. యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామ’ని ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా ‘ఒడిశా రైల్వేస్టేషన్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇచ్ఛాపురంలో రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది లేరు. దీంతో ఒడిశాలో కొనుగోలు చేసి గంజాయిని అక్కడ నుంచి కాకుండా.. ఇచ్ఛాపురం స్టేషన్ నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పట్టుబడుతున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్‌ఐలు చిన్నంనాయుడు, రాము, సిబ్బంది పాల్గొన్నారు.