Share News

ప్రతి ఇంటికీ.. జియోట్యాగింగ్‌

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:35 PM

జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికీ జియోట్యాగింగ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. భౌగోళికంగా అక్షాంశాలు, రేఖాంశాలతో సహా ఫొటోలు తీసి అప్‌డేట్‌ చేసే పనిలో సచివాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు.

ప్రతి ఇంటికీ.. జియోట్యాగింగ్‌

- సచివాలయ ఉద్యోగుల సర్వే

- కుటంబ యజమాని ఐరిస్‌ క్యాప్చర్‌

- అర్హులకు లబ్ధి కలిగించేందుకే

- కమిషనర్లు, ఎంపీడీవోల పర్యవేక్షణ

శ్రీకాకుళం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికీ జియోట్యాగింగ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. భౌగోళికంగా అక్షాంశాలు, రేఖాంశాలతో సహా ఫొటోలు తీసి అప్‌డేట్‌ చేసే పనిలో సచివాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు జియోట్యాగింగ్‌ ప్రక్రియ నిర్వహించేవారు. వారే ఫోన్‌లో ఫొటోలను తీసి సర్వేను పూర్తిచేసి సచివాలయ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసేవారు. ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థ లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాస్తవ ఇళ్ల లెక్క ఆధారంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చేందుకు ఈ నెల 8 నుంచి ‘హౌస్‌హోల్డ్‌ జియోట్యాగింగ్‌ సర్వే’ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్‌ చేయిస్తోంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 732 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో 7,41,914 గృహాలు ఉన్నాయి. సచివాలయ క్లస్టర్‌ పరిధిలో ఉన్న ఇళ్లకు సిబ్బంది వెళ్లి.. జియోట్యాగింగ్‌ సర్వే చేస్తున్నారు. కుటుంబ యజమానికి ఫొటో తీసి ఐరిష్‌ను క్యాప్చర్‌ చేస్తున్నారు. నివసిస్తున్న ఇంటితో కలిపి జీపీఎస్‌తో అనుసంధానం చేస్తూ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. కుటుంబ యజమాని అందుబాటులో లేకపోతే రేషన్‌కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల ఫొటోను తీసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. బుధవారం నాటికి 2,47,406 ఇళ్ల సర్వే పూర్తయి.. వెబ్‌సైట్‌లో ఫొటోలను పొందుపరిచారు. ఇంకా 4,94,508 ఇళ్లకు సర్వే చేసి ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. నగరం, పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

- మొరాయిస్తున్న డివైజ్‌లు..

జియో ట్యాగింగ్‌ చేస్తున్న సచివాలయ సిబ్బందికి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డివైజ్‌లు సరిగా పనిచేయడంలేదు. కొన్నిచోట్ల మొబైల్‌ను ఉపయోగిస్తున్నా.. డేటా అనుసంధానం కాకపోవడం.. తీసిన ఫొటో క్యాప్చర్‌ అయినా.. నెట్‌వర్క్‌ సరిగా లేక అప్‌లోడ్‌ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. దీనివల్ల జియోట్యాగింగ్‌కు సమయం ఎక్కువ పడుతోందని పేర్కొంటున్నారు. ప్రతి రోజూ ఎన్ని ఇళ్లకు సర్వే చేశారనే విషయాన్ని కలెక్టర్‌ పరిశీలిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక ఇళ్లలో నివసిస్తున్నవారి సంఖ్య కచ్చితత్వం కానుంది. మొత్తం లెక్క తేలనుంది.

Updated Date - Nov 14 , 2024 | 11:35 PM