Share News

వైద్య విద్య అందని ద్రాక్ష

ABN , Publish Date - May 26 , 2024 | 11:16 PM

అంతర్జాతీయంగా ఎటువంటి ఘటనలు జరిగినా.. విపత్తులు చోటుచేసుకున్నా.. అందులో తెలుగు వైద్య విద్యార్థులు, సిక్కోలుకు చెందిన వారు చిక్కుకోవడం పరిపాటిగా మారింది. ఆ సమయంలో కన్నవారు పడే బాధలు వర్ణనాతీతం.

వైద్య విద్య అందని ద్రాక్ష
కిర్గిస్తాన్‌లో జిల్లా విద్యార్థులు (ఫైల్‌)

- మెడికల్‌ కాలేజీల హామీని మరచిన సర్కారు

- ఐదేళ్లు పూర్తయినా ఏర్పాటు చేయలే

- విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు

- అక్కడ యుద్ధాలు, అల్లర్లతో ఇబ్బందులు

- అప్పుడు ఉక్రెయిన్‌లో.. ఇప్పుడు కిర్గిస్తాన్‌లో..

- తిరుగుముఖం పడుతున్న సిక్కోలు విద్యార్థులు

- మధ్యతరగతి వారికి తీరని నష్టం

(రణస్థలం)

-2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం జరిగింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు చిక్కుకున్నారు. అందులో జిల్లాకు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు. చాలారోజుల పాటు అక్కడే ఉండిపోయారు. దీంతో స్వగ్రామాల్లో తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవచూపడంతో కేంద్ర ప్రభుత్వం వారిని స్వస్థలాలకు రప్పించింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

- తాజాగా కిర్గిస్తాన్‌లో జిల్లాకు చెందిన దాదాపు 250 మంది వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. అక్కడ రాజధానిలోని భిష్‌కేక్‌లో అంతర్చాతీయ విద్యార్థులను టార్గెట్‌ చేసుకొని అల్లరిమూకలు గత వారంలో దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటికే భారత విద్యార్థులపై దాడులు చేశారు. దీంతో స్వగ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి తాము క్షేమంగా ఉన్నామని వారి నుంచి సమాచారం అందుతున్నా.. భారత విద్యార్థులను టార్గెట్‌ చేసుకొని దాడులు పెరుగుతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు.

అంతర్జాతీయంగా ఎటువంటి ఘటనలు జరిగినా.. విపత్తులు చోటుచేసుకున్నా.. అందులో తెలుగు వైద్య విద్యార్థులు, సిక్కోలుకు చెందిన వారు చిక్కుకోవడం పరిపాటిగా మారింది. ఆ సమయంలో కన్నవారు పడే బాధలు వర్ణనాతీతం. మన దేశంలో, అందునా మన రాష్ట్రంలో వైద్య వృత్తి చేయాలంటే పేద, మధ్యతరగతి వారికి అందని ద్రాక్షే. తగినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవు. ఎన్నికలకు ముందు ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీ బుట్టదాఖలైంది. స్థల సేకరణ, శంకుస్థాపనల పేరిట హడావుడి చేశారే తప్ప ఎక్కడా పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా జాతీయ స్థాయి వైద్య కాలేజీల నిర్మాణానికి అవకాశం ఉన్నా.. జగన్‌ సర్కారు ఎన్నడూ పట్టుబట్టలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. కొన్ని కేంద్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా..ఏపీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని స్వయంగా కేంద్రమే ప్రకటించింది.

సీటు దక్కాలంటే చాలా కష్టం

వైద్య విద్య చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న విద్యార్థులకు ఏపీలో అది తీరే అవకాశం లేదు. బీఏ, బీకాం, బీఎస్సీ..దేనిలో చేరాలన్నా సీటు దొరకుతుంది. అందుబాటులో కళాశాలలు ఉంటాయి. ఇంజనీర్‌ కావాలంటే సొంత జిల్లాల్లో కాలేజీలు ఉన్నాయి. కానీ ఇంటర్‌ జువాలజీలో 99 శాతం మార్కులు వచ్చినా..వైద్య విద్య అర్హత పరీక్షకు సిద్ధమై భారీ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిన్నటి దాకా ఎంసెట్‌గా ఉన్న ప్రవేశ పరీక్ష.. నిట్‌గా మారిపోయింది. జాతీయ స్థాయి అర్హత పరీక్షగా మారిపోయింది. ఇంటర్‌ బైపీపీలో 90 శాతంతో ఉత్తీర్ణత సాధించి.. వైద్య విద్యకు సంబంధించి అర్హత సాధించలేకపోయిన వారు లక్షల మంది ఉంటారంటే అతిశయోక్తి కాదు. మెడికల్‌ సీట్లు తక్కువగా ఉండడంతో పూర్తిగా వడబోత అనివార్యంగా మారింది. అదే వైద్య కళాశాలలు అందుబాటులో ఉంటే.. మరిన్ని సీట్లు దక్కించుకునే చాన్స్‌ ఉంటుంది. సీటు దొరికే మంచి ర్యాంకు రానప్పుడు..యాజమాన్య కోటాకు తగ్గట్టు ఆర్థిక స్థితి లేనప్పుడు వైద్య విద్యపై ఆశలు వదులుకోవాల్సిందే.

అంతర్గత సమస్యల్లో దాపరికాలు..

స్వదేశంలో వైద్య విద్యకు సంబంధించి సీటు రానప్పుడు..విదేశీ యూనివర్సిటీలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా మద్యతరగతి విద్యార్థులకు ఆశాధీపంలా మారుతున్నాయి. అయితే విదేశీ వైద్య విద్య రూపంలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. అక్కడున్న పరిస్థితులు, దేశ అంతర్గత భద్రతా సమస్యలు వంటివి దాచిపెడుతున్న సదరు యూనివర్సిటీలు ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఫలితంగా నాలుగేళ్ల వైద్య విద్యలో మధ్యలో ఎన్నోరకాల అవంతరాలు ఎదురవుతున్నాయి. పిల్లల విద్యకోసం ఉన్న ఆస్తులను అమ్ముకొని కొంతమంది తల్లిదండ్రులు చదివిస్తుంటారు. అటువంటి వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో జిల్లాకు చెందిన 250 మంది విద్యార్థులు అక్కడ వైద్య విశ్వవిద్యాలయాల నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు అదుపులోకి రాకపోయేసరికి.. దాదాపు ఏడాది పాటు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఏడాది విలువైన సమాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఆ పది దేశాల వైపే మొగ్గు..

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఓ పది దేశాల వైద్య యూనివర్సిటీల్లో ఎక్కువగా చేరుతుంటారు. జార్జియా, పిలిప్పిన్స్‌, చైనా, కర్గిస్తాన్‌, ఉక్రెయిన్‌, రష్యా, మధ్య అమెరికా ఖండాల్లోని కొన్ని దీవులు, కరేబియన్‌ దీవుల్లోని వైద్య కళాశాలల్లో చేరుతుంటారు. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎక్కువగా ఉంటుందని ఇక్కడి విద్యార్థులు నమ్ముతుంటారు. అయితే కొన్నేళ్ల కిందట వరకూ ఫర్వాలేకున్నా.. ఇటీవల మాత్రం అంతర్జాతీయ వివాదాలు, దేశ అంతర్గత సమస్యలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విపత్తులు, అల్లరిమూకల దాడులతో నష్టపోతున్నారు.

ఇవి గమనించుకోవాలి

వైద్య విద్య కోసం విదేశీ యూనివర్సిటీలను సంప్రదించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే కళాశాలలను ఎంపిక చేసుకోవాలంటున్నారు. ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్‌ డిక్సనరీలో కళాశాల నమోదైందా? లేదా? చూసుకోవాలి. వెళ్తున్న దేశంలో చదవాలనుకుంటున్న కళాశాలకు అక్కడి ప్రభుత్వం గుర్తింపు ఉందో? లేదో? తెలుసుకోవాలి. చేరబొయే కళాశాలకు సంబంధించి దేశంలో భారత రాయభార కార్యాలయం ఉందో? లేదో? తెలుసుకోవడం తప్పనిసరి.

వారం రోజుల పాటు భయం..భయం

కిర్గిస్తాన్‌లోని వైద్య విశ్వ విద్యాలయంలో చదువుతున్నాను. అక్కడ విదేశీ విద్యార్థులను టార్గెట్‌ చేసుకొని అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. దాదాపు వారం రోజుల పాటు హాస్టల్‌ గదులకే పరిమితం అయ్యాం. ఎప్పుడు ఎవరు దాడిచేస్తారోనని భయాందోళనకు గురయ్యాం. క్షణక్షణం భయంతోనే గడిపాం. భారత విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. విచక్షణారహితంగా కొట్టడంతో కొంతమంది గాయపడ్డారు. వాట్సాప్‌ గ్రూపులతో పాటు మీడియాలో ఈ వార్తలు విని కంగారుపడిపోయాం. సకాలంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం స్వస్థలాలకు తరలించడంతో ఊపిరిపీల్చుకున్నాం.

- మహంతి అనన్య, వైద్య విద్యార్థిని, రణస్థలం

కాలేజీల సంఖ్య పెరగాలి

దేశీయంగా వైద్య కళాశాలల సంఖ్య పెరగాలి. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తేవాలి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కాలేజీ ఏర్పాటు చేయాలి. సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగాలి. అప్పుడే స్థానిక విద్యార్థులకు ర్యాంకులు, వారి లక్ష్యానికి అనుగుణంగా వైద్య విద్య అందుతుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించుకొవాల్సిన అవసరం ఉంది.

- మహంతి శ్రీదేవి, వైద్య విద్యార్థిని తల్లి, రణస్థలం

వైద్యులు లేకపోవడం లోటు

మన దేశంలో జనాభాకు తగ్గట్టుగా వైద్యలు లేకపోవడం చాలా లోటు. కేవలం వైద్యరంగానికే సింహ భాగం కేటాయింపులు జరిపిన దేశాలు ఉన్నాయి. వాటి సరసన భారత్‌ చేరాల్సిన అవసరం ఉంది. దేశంలో విస్తృతంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుకావాలి. అప్పుడే వైద్యవిద్యపై విద్యార్థుల ఆకాంక్ష, ఆశలు తీరుతాయి. లేకుంటే విదేశీ వైద్య కళాశాలలపై ఆధారపడక తప్పని పరిస్థితి.

-వెంకునాయుడు, ఓ వైద్య విద్యార్థి తండ్రి, చిలకపాలెం

Updated Date - May 26 , 2024 | 11:16 PM