Share News

జీడి గోదాముపై జీఎస్టీ అధికారుల దాడులు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:16 PM

స్థానిక జీడి బ్రోకర్‌ సిందిరి శ్రీనివాస్‌ (ఎక్స్‌లెంట్‌ క్యాజూ సప్లయర్స్‌) గోదాముపై శుక్రవారం జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ (విజయనగరం) కె.వెంకటరమణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు.

జీడి గోదాముపై జీఎస్టీ అధికారుల దాడులు
గోదాములో సోదాలు చేస్తున్న జీఎస్టీ అధికారులు

- ఇది కక్ష పూరితమంటున్న వ్యాపారి

పలాస, జూలై 26: స్థానిక జీడి బ్రోకర్‌ సిందిరి శ్రీనివాస్‌ (ఎక్స్‌లెంట్‌ క్యాజూ సప్లయర్స్‌) గోదాముపై శుక్రవారం జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ (విజయనగరం) కె.వెంకటరమణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. గోదాములో 750 కిలోల జీడిపప్పు మాత్రమే ఉన్నట్లు గుర్తించి.. ప్రాథమిక తనిఖీలు చేశారు. అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీలు చేశామన్నారు. ఏటా జీడి వ్యాపార సంస్థల రికార్డులు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. బ్రోకర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇవి కక్ష పూరితంగా నిర్వహించిన దాడులేనని ఆరోపించారు.

- ఈ ఏడాది జనవరిలో కాశీబుగ్గ జీఎస్టీ కార్యాలయంలో ఏసీటీవో స్థాయి అధికారి కిషోర్‌కుమార్‌ ఏసీబీ దాడిలో అడ్డంగా బుక్కయ్యారు. బ్రోకర్‌ శ్రీనివాసరావుకు సంబంధించి రూ.18లక్షల నగదు వ్యాపారి అకౌంట్‌కు రావాల్సి ఉంది. దీనికి భారీ మొత్తం డిమాండ్‌ చేయడంతో వాటిని ఇచ్చేందుకు ఇష్టం లేని శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కా ప్రణాళికతో జీఎస్టీ అధికారి కిషోర్‌కుమార్‌ను పట్టుకున్నారు. తాజాగా బ్రోకర్‌ గోదాంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. జీఎస్టీ అధికారుల తీరుపై వ్యాపారులు కూడా మండిపడుతున్నారు. అధికారులు మాత్రం ఇది సాధారణ తనిఖీలేనని చెబుతుండడం గమనార్హం.

Updated Date - Jul 26 , 2024 | 11:16 PM