ఏమైందో..
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:33 AM
ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముద్దాడ దిలీప్‌కుమార్(15) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండేళ్ల కిందట ఈ పాఠశాలకు చెందిన తొమ్మిది తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిలీప్‌కుమార్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
- ఎస్.ఎం.పురం గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య
- కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు
ఎచ్చెర్ల, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముద్దాడ దిలీప్‌కుమార్(15) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండేళ్ల కిందట ఈ పాఠశాలకు చెందిన తొమ్మిది తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిలీప్‌కుమార్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏమైందోనని.. ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడోనని విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందిన వాసుదేవరావు, లక్ష్మి దంపతుల కుమారుడైన దిలీప్‌కుమార్.. ఐదో తరగతి నుంచీ ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం రాత్రి బట్టలు ఆరబెట్టేందుకు తాడు కావాలని దిలీప్ మరో విద్యార్థిని అడిగాడు. తర్వాత రాత్రి 10గంటల సమయంలో విద్యార్థులంతా డార్మెంటరీకి నిద్రించడానికి వెళ్లారు. దిలీప్ చిన్న లైటు పట్టుకుని డార్మెంటరీ నుంచి బయటకు వెళ్లాడు. ఆ రాత్రి ఏమి జరిగిందో కానీ.. తరగతి గది శ్లాబ్‌పైకి ఎక్కి.. అక్కడి నుంచి స్లేడ్‌కు నైలాన్ తాడు కట్టి ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో ప్రిన్సిపాల్ గణస్వామి పాఠశాలకు రాగా, విద్యార్థులంతా స్టడీ అవర్‌కు వచ్చారు. దిలీప్ కన్పించలేదు. దీంతో విద్యార్థులు వెళ్లి చూడగా.. దిలీప్ శ్లాబ్ నుంచి కిందికి నైలాను తాడుతో వేలాడి విగతజీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్.. విద్యార్థి తల్లిదండ్రులకు, పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు.
తల్లిదండ్రుల ఆందోళన
కుమారుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మి, వాసుదేవరావు.. పర్లాం మాకివలస నుంచి గుండెలు బాదుకుంటూ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. కుమారుడు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతిపై అనుమానం వ్యక్తంచేశారు. తమకు సరైన న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆందోళన చేపట్టారు. జేఆర్‌పురం సీఐ అవతారం, ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి మృతిని ఆత్మహత్యగా కేసు నమోదుచేసి, పోస్ట్‌మార్టం నివేదిక దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ సందీప్‌కుమార్ తెలిపారు.
ఆర్డీవో, ఎమ్మెల్యే పరామర్శ
శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఈవో ఎస్.తిరుమల చైతన్య, ఎంఈవో కారు పున్నయ్య, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు.. గురుకుల పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతోను, గురుకుల సిబ్బందితో మాట్లాడారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పోలీసులకు సూచించారు. విద్యార్థి తల్లిదండ్రులకు రూ.10వేలు పరిహారం అందజేశారు. వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. అనంతరం విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడి విషయాన్ని చేరవేశారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ గొంటి నర్సింగరావు, బీజేపీ సీనియర్ నేత సంపతిరావు నాగేశ్వరరావు పాల్గొన్నారు.