Share News

అంతటా హైఅలెర్ట్‌

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:37 PM

తుఫాన్‌ కారణంగా జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అంతటా హైఅలెర్ట్‌ ప్రకటించింది.

        అంతటా హైఅలెర్ట్‌
బాహుదాలో వరద ప్రవాహం

- తుఫాన్‌తో జిల్లాలో మోస్తరు వర్షాలు

- నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం

- పోలాకి, జలుమూరులో నీటమునిగిన 282 ఎకరాల వరి

- తీరప్రాంతాల్లో పర్యటించిన అధికారుల బృందం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

తుఫాన్‌ కారణంగా జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అంతటా హైఅలెర్ట్‌ ప్రకటించింది. శనివారం తుఫాన్‌ తీరందాటడంతో జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షలు కురిశాయి. జిల్లాపై తుఫాన్‌ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగానే ఉంది. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా వంశధార, నాగావళి నదుల్లో స్వల్పంగా నీటి ప్రవాహం పెరిగింది. ఇచ్ఛాపురం వద్ద బహుదా నది ఉగ్రరూపం దాల్చింది. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి, జలుమూరు మండలాల్లో వంశధార కుడి ప్రధాన కాలువ పరిధిలో 282 ఎకరాల్లో వరి పైరు ముంపునకు గురైంది. దీంతో కాలువలో నీటి ఉధృతిని తగ్గించారు. మరో మూడురోజుల్లో వరి పైరు సాధారణ స్థితికి చేరుకుంటుందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఆదివారం జిల్లాలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 రోజుల తర్వాత గత నాలుగు రోజుల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యటించారు. అలాగే నదీ తీర ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లనీయకుండా హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా సోమవారం జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

కలెక్టరేట్‌: తుఫాన్‌ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల నోడల్‌ అధికారులు, ఆర్డీవోలతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై కలెక్టర్‌ సమీక్షించారు. నదులు, చెరువుల్లోని నీటిమట్టాలపై ఆరా తీశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, నీటి పారుదల, వైద్య ఆరోగ్య, విద్యుత్తు, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, ఉద్యానవన, గృహనిర్మాణ శాఖల సన్నద్ధతపై ఆరా తీశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. భారీ వర్షాల అనంతరం పర్యవసానాలపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.


నారాయణపురం ఆనకట్ట పరిశీలన

బూర్జ: మండలంలోని నారాయణపురం ఆనకట్టను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం పరిశీలిం చారు. ఆనకట్ట పరిధిలోని రైతులతో మాట్లాడారు. షట్టర్లు పాడయ్యాయని, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న గుర్రపుడెక్కను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. తుఫాన్‌ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను లేదా హెల్ప్‌లైన్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. నదీతీర గ్రామాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసి నదిలో నీటిమట్టం పెరిగితే ముంపు ప్రాంతాలపై దృష్టిపెట్టాలన్నారు. అత్యవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం ఉప్పినివలస గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్య క్రమంలో తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ, డీటీ సంతోష్‌కుమార్‌, ఆర్‌ఐ, ఇరిగేషన్‌ ఏఈ బుజ్జి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.


సంకుజోడి ఫీడర్‌ ఛానల్‌కు గండి

హరిపురం: వర్షాలకు సంకుజోడి, సునాముది ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కుంబిగాం వద్ద సునాముదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. అలాగే, వరద ప్రవాహానికి సంకుజోడి ఫీడర్‌ ఛానల్‌కు గండి పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బాహుదాకు జలకళ

ఇచ్ఛాపురం: జిల్లాతో పాటు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు బాహుదా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మొన్నటి వరకూ నీరు లేక ఎడారిలా ఉన్న బాహుదా ప్రస్తుతం నీటితో కళకళలాడుతోంది. నదికి నీరు చేరటంతో ఇక తమకు తాగునీటి కష్టాలు తప్పనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నదిలో నీరు లేకపోవడంతో అధికారులు రోజు విడిచి రోజు కొళాయిల ద్వారా తాగునీరు అందించేవారు. ఇప్పుడు ప్రతిరోజూ తాగునీటిని సరఫరా చేయనున్నారు.


పూండిలంకను చుట్టుముట్టిన ఉప్పుటేరు

వజ్రపుకొత్తూరు: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వజ్రపుకొత్తూరు పూండిలంక గ్రామం చుట్టూ ఉప్పుటేరు నీరు చేరింది. దీంతో నడకదారి కొట్టుకు పోవడంతో పూడిలంకవాసులు అత్యవసర సమయాల్లో పడవపైనే రాకపోకలు సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేకాధికారి బి.ఉమామహేశ్వరరావు, తహసీల్దార్‌ పి.బాల, ఎంపీడీవో ఈశ్వరమ్మ, డీటీ వి.గిరిరాజు, ఈవోపీఆర్డీ తిరుమలరావు, ఆర్‌ఐ పవిత్ర పూడిలంక గ్రామానికి పయమయ్యారు, అయితే, గ్రామానికి వెళ్లేందుకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పడవపైనే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తామంతా ఉన్నామని ఆందోళన చెందవద్దని తెలిపారు. ఏ సమస్య వచ్చినా తమకు సమాచారం అందించాలని కోరారు.


వేటకు వెళ్లొద్దు: ఎస్పీ

గార: తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం బందరువానిపేట గ్రామంలో ఎన్‌డీఏ బృందంతో కలిసి పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నప్పుడు అటు వైపుగా వెళ్లవద్దని, అధికారులు చెప్పినంత వరకూ వేట చేయవద్దని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ కె.కృష్ణ్రపసాద్‌, ఇతర అదికారులు ఉన్నారు. అలాగే తుఫాన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శాంతిశ్రీ కూడా కళింగపట్నం, బందరువానిపేట పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.


నేడు విద్యా సంస్థలకు సెలవు

కలెక్టరేట్‌/నరసన్నపేట, సెప్టెంబరు 1: తుఫాన్‌ కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సోమవారం సెలవును ప్రకటిస్తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.తిరుమల చైతన్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం తుఫాన్‌ తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 11:38 PM