శబరిమలైకి వెళ్లేదెలా?
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:54 PM
ఈ ఏడాది జిల్లాలో అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్పస్వామి మాల ధరించారు.
- ప్రత్యేక రైళ్లు ప్రకటించని ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ
- ఆందోళనలో అయ్యప్ప భక్తులు
ఆమదాలవలస, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్పస్వామి మాల ధరించారు. వీరంతా దీక్ష విరమణకు కేరళ రాష్ట్రం శబరిమలైలోని అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్తుంటారు. ఇప్పటికే శబరిమలైలో అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకున్నాయి. డిసెంబరు నెలాఖరు వరకు జరిగే మండల దీక్ష విరమణ కోసం శ్రీకాకుళంతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని ఎంతో మంది అయ్యప్ప భక్తులు అధికంగా రైళ్లలో వెళ్లేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే, కేరళకు వెళ్లే రైళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ మూడు నాలుగు రైళ్లు మాత్రమే కేరళకు నడుస్తుంటాయి. మూడు నెలల ముందే ఈ రైళ్లలోని సీట్లకు రిజ్వర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో శబరిమలైకు వెళ్లేదెలా? అని మాలధారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు ఈస్ట్‌కోస్టు రైల్వేశాఖ అధికారులు ప్రత్యేక రైళ్లకు సంబంధించి ప్రకటన చేయలేదు. ఈనెలాఖరుతో పాటు డిసెంబరు నెల మొదటి రెండు వారాల్లో అధిక సంఖ్యలో భక్తులు శబరిమలై వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తుల కోసం 23 ప్రత్యేక రైళ్లు ప్రకటించాయి. కానీ, ఈస్ట్‌కోస్ట్ పరిధిలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా భక్తుల కోసం ఇప్పటివరకు ఎటువంటి రైల్వే ప్రకటన రాకపోవడంతో శబరిమలై ప్రయాణంపై సందిగ్దం నెలకొంది. ప్రత్యేక రైళ్లు కేటాయిస్తుందా? లేదా అని ఆందోళన చెందుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు శబరిమలైకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు కృషి చేయాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.
ప్రత్యేక రైళ్లు నడపాలి..
జిల్లాలోని అయ్యప్ప భక్తులు శబరిమలైకు వెళ్లేందుకు సరైన రైల్వే సౌకర్యాలు లేవు. తక్షణమే ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపడానికి చర్యలు చేపట్టాలి.
- గోవిందరావు, బీజేపీ మండల అధ్యక్షుడు, సరుబుజ్జిలి
ఇబ్బందులు తప్పేలా లేవు..
ఈ ఏడాది నాతో పాటు 20 మంది అయ్యప్పస్వామి మాల ధరించారు. దీక్ష విరమణ కోసం శబరిమలైకు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో మాకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఉన్న రైళ్లు నిండుకోవడంతో ఆమదాలవలస రైల్వే స్టేషన్ (శ్రీకాకుళంరోడ్) నుంచి తమిళనాడు వరకు ఒక రైలులో, తమిళనాడు నుంచి కేరళకు మరో రైలులో వెళ్లేందుకు టిక్కెట్లు తీసుకోవాల్సి వస్తుంది. కేరళకు ప్రత్యేక రైళ్లు నడిపితే ఉత్తరాంధ్ర స్వాములకు అనుకూలంగా ఉంటుంది.
- ఎండ రామారావు, సరుబుజ్జిలి