ప్రమాదపుటంచున.. హుద్‌హుద్ ఇళ్లు
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:38 PM
హుద్‌హుద్ గృహ సముదాయం ప్రమాదం అంచున ఉంది. ఇక్కడ కంకర అక్రమ తవ్వకాలు చేపడుతుండడంతో.. ఏ క్షణానైనా ఇళ్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- ఎప్పుడైనా కూలిపోయే అవకాశం
- కొండపై కంకర అక్రమ తవ్వకాలే కారణం
పలాస, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): హుద్‌హుద్ గృహ సముదాయం ప్రమాదం అంచున ఉంది. ఇక్కడ కంకర అక్రమ తవ్వకాలు చేపడుతుండడంతో.. ఏ క్షణానైనా ఇళ్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2017లో స్థానిక పారిశ్రామికవాడ వెనుకభాగాన నెమలికొండ అంచున మొత్తం 198 హుద్‌హుద్ గృహాలు నిర్మించారు. ఒక్కో గృహానికి రూ.4.03లక్షలు చొప్పున కేటాయించారు. కాగా.. ఆ గృహాలను ఇప్పటివరకూ లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో.. భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. రూ.కోట్ల విలువైన ప్రజాధనం వృథా అవుతోంది. కొండకు ఆనుకుని ఈ గృహాలు నిర్మించడంతో.. ఎవరూ ఈ ప్రాంతానికి రావడం లేదు. ఇదే అదనుగా అక్రమార్కులు కొండపై కంకరను తవ్వకాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. కింది భాగాన సుమారు 50 అడుగుల లోతులో కంకరను తవ్వేయడంతో ఆ గృహాలు కూలిపోతాయోమోనని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లకు సంబంధించి స్తంభాల పక్కన పూర్తిగా కంకర తవ్వేశారు. దీంతో స్తంభాలు సైతం కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు, జీడి పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో రెండు ఎకరాలకు పైగా అక్రమంగా కంకరను తవ్వినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి కంకర తవ్వకాలు అక్రమ అరికట్టాలని, ఇళ్ల సముదాయానికి ఇబ్బందులు లేకుండా గోతులు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.