కొబ్బరి పార్క్ కలేనా?
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:25 AM
ఉద్దానంలో కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరేళ్ల కిందట వచ్చిన తితలీ తుఫాన్ దెబ్బకు పంట అంతా నాశనమైంది. కొబ్బరి పంటను కాపాడి.. రైతులను ఆదుకుంటామన్న నేతల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
- అమలు కాని పాదయాత్ర హామీ
- సీఎం అయ్యాక పట్టించుకోని జగన్
- ఉద్దానం ప్రాంత రైతులకు కన్నీరే
- ఆర్థికంగా తప్పని ఇబ్బందులు
(కవిటి)
ఉద్దానంలో కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరేళ్ల కిందట వచ్చిన తితలీ తుఫాన్ దెబ్బకు పంట అంతా నాశనమైంది. కొబ్బరి పంటను కాపాడి.. రైతులను ఆదుకుంటామన్న నేతల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాదయాత్ర సమయంలో.. గత సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో పర్యటించారు. తాము అధికారంలోకి వస్తే కొబ్బరిపార్క్ ఏర్పాటు చేస్తామని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ఆ దిశగా కార్యచరణ చేపట్టలేదు. దీంతో రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదంటూ రైతులు నిట్టూర్చుతున్నారు. కొబ్బరిపార్క్ ఏర్పాటు కలగానే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. కొబ్బరిపంటకు మద్దతు ధర కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోతోందని వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో 35వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కొబ్బరి పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వరుసగా తుఫాన్లు, తెగుళ్ల బెడదతో కొబ్బరి రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కొబ్బరి పంట నాశనమైంది. నిత్యం పచ్చదనంగా కనిపించే ఉద్దానంలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్నాయి. తెల్లదోమ, నల్లముట్టె, కొమ్ముపురుగు, కాండం తొలుచు పురుగు సోకి.. పంట పాడైపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తెగుళ్ల తాకిడితో ఎకరా తోటలో కనీసం 200 కొబ్బరికాయలు కూడా దిగుబడి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొబ్బరి పంటకు మద్దతు ధర కల్పిస్తామని నేతలు హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఒకప్పుడు కొబ్బరికి ప్రధాన మార్కెట్‌గా నిలిచిన కంచిలి నుంచి కూడా ఉత్తరాదికి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో చాలామంది కార్మికులు కూడా ఉపాధి కోసం వలస బాట పట్టారు. అలాగే నష్టాల బారిన పడిన కొంతమంది రైతులను తమ కొబ్బరి తోటలను రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించేస్తున్నారు. ఈ క్రమంలో సాగు తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితులు మారాలంటే.. కొబ్బరిపార్క్ నిర్మించాలని, మద్దతు ధర కల్పించాలని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం విఫలం
ఉద్దానంలో కొబ్బరిపంట అభివృద్ధి కలగా మిగిలింది. కొబ్బరిపార్కు ఏర్పాటు చేస్తామన్నారే తప్ప.. ఆ దిశగా చర్యలు లేవు. తెగుళ్లు తాకిడితో పంట రోజురోజుకీ దిగజారిపోతోంది. కొబ్బరిచెట్టును కాపాడటం కష్టంగా మారింది. గిట్టుబాటు ధర.. హామీగానే మిగిలింది. ఉద్దానం రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైంది.
- బి.చిన్నబాబు, రైతు, బల్లిపుట్టుగ
............................
యువకులు వలస బాట
ఉద్దానంలో కొబ్బరిపంటనే నమ్ముకొని జీవనం సాగించలేక యువకులు వలసబాట పడుతున్నారు. వరుసగా తుఫాన్ల తాకిడితో కొబ్బరిపంటపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. వ్యవసాయం చేస్తే అప్పులు మిగులుతున్నాయి. కుటుంబాన్ని పోషించుకోవాలంటే సంపాదనకు గ్రామాన్ని విడిచి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
- పాండు దొళాయి, రైతు, బల్లిపుట్టుగ