Share News

నదుల అనుసంధానమే నా ప్రధాన లక్ష్యం

ABN , Publish Date - May 06 , 2024 | 11:47 PM

ఆమదాలవలస నియోజకవర్గ రైతాంగానికి ఎంతో అవసరమైన వంశధార, నాగావళి నదుల అనుసంధానమే తన ప్రధాన లక్ష్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కూన రవికుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, స్పీకర్‌ తమ్మినేని కుటుంబం అక్రమార్జనమైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు రవికుమార్‌ సమాధానాలు చెప్పారు.

నదుల అనుసంధానమే   నా ప్రధాన లక్ష్యం

(ఆమదాలవలస)

ఆమదాలవలస నియోజకవర్గ రైతాంగానికి ఎంతో అవసరమైన వంశధార, నాగావళి నదుల అనుసంధానమే తన ప్రధాన లక్ష్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కూన రవికుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, స్పీకర్‌ తమ్మినేని కుటుంబం అక్రమార్జనమైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు రవికుమార్‌ సమాధానాలు చెప్పారు.

ప్రశ్న: ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు?

జవాబు: 2014 ఎన్నికల్లో నేను శాసన సభ్యునిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టాను. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చూపింది. అర్ధాంతరంగా ఎన్నో పనులు ఉండిపోయాయి. ఈ ఎన్నికల్లో నేను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అత్యవసరమైన పనులన్నీ పూర్తి చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను.

ప్ర: విజయంపై మీకున్న నమ్మకమేంటి?

జ: గ్రామస్థాయి నుంచి పలు పదవులు చేపట్టి ఈ స్థాయికి వచ్చాను. ప్రజాసేవే కర్తవ్యంగా పనిచేస్తానని, నీతి నిజాయితీతో కూడిన రాజకీయ నాయకుడిననే గుర్తింపు నాకు ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు దాన్ని గుర్తించి నాకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంది. నాపై పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం శాసనసభాపతి పదవిలో ఉన్నా నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయకుండా వదిలేశారు. స్పీకర్‌, ఆయన కుటుంబ సభ్యు లు అక్రమ సంపాదనపైనే దృష్టిపెట్టారు. నా పనితీరే నా విజయానికి దోహదపడుతుందనే నమ్మకం ఉంది.

ప్ర: నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరిస్తారా?

జ: పొందూరు మండలంలోని రెల్లిగెడ్డ, ఆమదాలవలస మండలంలోని కొత్తగెడ్డ, బూర్జ మండలంలోని ఓనిగెడ్డను నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేశాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో రైతులకు అవసరమైన సాగునీటి కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ముఖ్యంగా జిల్లాలో 60 వేల ఎకరాలకు సాగునీటిని అందించే వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులను టీడీపీ హయాంలో 70 శాతం పూర్తి చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయడంలో వైసీపీ సర్కారు విఫలమైంది. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే నదుల అనుసంధాన పనులు పూర్తి చేయడమే నా ప్రధాన కర్తవ్యం.

ప్ర: వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా?

జ: అవును. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఎంతో ప్రధానమైన ఆమదాలవలస-శ్రీకాకుళం రహదారి విస్తరణ పనులను పూర్తి చేయలేకపోయింది. ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యుడే సభాపతిగా ఉన్నప్పటికీ ఈ రోడ్డు పనులను పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రహదారి విస్తరణకు రూ.40 కోట్లు మంజూరు చేశాం. అయినప్పటికీ ఐదేళ్లలో పనులను పూర్తి చేయలేకపోయారు. ఈ గుంతల రహదారిపై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారులే పూర్తి చేసుకోలేని ఈ ప్రభుత్వం మిగిలిన అభివృద్ధి ఎలా చేస్తుంది.?

ప్ర:ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై మీ అభిప్రాయం?

జ: రాష్ట్ర ప్రజల ఆస్తులను సైకో సీఎం జగన్‌రెడ్డి బలవంతంగా లాక్కొనేందుకే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తీసుకుచ్చారు. దీన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడు ఎదురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

ప్ర: ఈ ఎన్నికల్లో కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది

జ: కేంద్ర, రాష్ట్రంలో జరిగిన అన్ని సర్వేలు కూడా కూటమికి అధికారమని చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పతనం తప్పదని తేల్చాయి. చంద్రబాబుపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజాతీర్పు తప్పకుండా మాకు అనుకూలంగా ఉంటుంది. 160 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి తిరుగులేని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం.

Updated Date - May 06 , 2024 | 11:47 PM