మినీ సెంటర్లను.. ప్రధాన కేంద్రాలుగా మార్చాలి
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:48 PM
సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు శనివారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్వంలో ధర్నా చేశారు. అంగన్‌వాడీ మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలు మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- అంగన్‌వాడీల డిమాండ్
- కలెక్టరేట్ వద్ద ధర్నా
అరసవల్లి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు శనివారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్వంలో ధర్నా చేశారు. అంగన్‌వాడీ మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలు మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లోని మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు అందజేస్తున్న సిబ్బందిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జిల్లాలో 599 మినీ అంగన్‌వాడీ కేందాలు ఉన్నాయి. వాటిలో సిబ్బందికి పనిభారం తప్ప.. వేతనాలు పెరగడం లేదు. యాప్‌లు, రికార్డుల రూపంలో అదనపు భారం పడుతోంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల మాదిరి.. ఇక్కడ కూడా మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీ అమలు చేయాలి’ అని వారు కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ జిల్లా నాయకులు పి.లతాదేవి, కె.సుజాత, కె.లక్ష్మి, భూలక్ష్మి, కె.మాధవి, కె.హేమలత, జె.కాంచన, నూకమ్మ, కొండమ్మ పాల్గొన్నారు.