చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతి
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:46 PM
ఇటీవల మతిస్థిమితం లేని తల్లికి జన్మించిన నవజాత శిశువు ఐదురోజులుగా చికిత్స పొందుతూ శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం మృతిచెందినట్లు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు.
నరసన్నపేట: ఇటీవల మతిస్థిమితం లేని తల్లికి జన్మించిన నవజాత శిశువు ఐదురోజులుగా చికిత్స పొందుతూ శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం మృతిచెందినట్లు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈనెల 8న రాత్రి 11 గంటల సమయంలో కోమర్తి కాలనీ అంగన్‌వాడీ కేంద్రం వద్ద పురటినొప్పులతో బాధపడుతున్న మతిస్థిమితం లేని ఒక మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నవజాత శిశువుతో పాటు తల్లికి కూడా 108లో పోలీసుల సమక్షంలో స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. అదే రోజు శిశువు ఆరోగ్యం విషమంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. ఐదురోజులుగా చికిత్స పొందిన నవజాత శిశువు మృతిచెందింది. ఈ విషయాన్ని బాల, శిశు సంరక్షణ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి చేరుకొని నవజాత శిశువు మృతదేహాన్ని కార్పొరేషన్ సిబ్బందితో ఖననం చేయించారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు తల్లిని శ్రీకాకుళం మధర్‌థెరిసా ఆశ్రమానికి తరలించినట్లు బాల,శిశు సంరక్షణ జిల్లా కౌన్సిలర్ డి.సీతారాం తెలిపారు.