Tidco Houses ఇళ్లూ లేవు.. డీడీలూ లేవు
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:57 AM
No Tidco Homes పట్టణ ప్రజలకు సొంతిళ్లు కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014-2019 మధ్య) టిడ్కో(ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై పూర్తి నిర్లక్ష్యం చూపింది. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకపోగా.. అంతకుముందు కొంతమంది చెల్లించిన డీడీలు సైతం వెనక్కి ఇవ్వలేదు.
- టీడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం
- గత ఐదేళ్లూ పట్టించుకోని వైనం
- ఏళ్ల తరబడి లబ్ధిదారుల నిరీక్షణ
- కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని వేడుకోలు
శ్రీకాకుళం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు సొంతిళ్లు కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014-2019 మధ్య) టిడ్కో(ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారుల ఆసక్తిని బట్టి వివిధ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు కొంత మొత్తాన్ని డీడీల రూపంలో తీసుకున్నారు. ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తికాగా.. ఇంతలో 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. దీంతో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించే ప్రక్రియను అప్పటి టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై పూర్తి నిర్లక్ష్యం చూపింది. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకపోగా.. అంతకుముందు కొంతమంది చెల్లించిన డీడీలు సైతం వెనక్కి ఇవ్వలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో లబ్ధిదారుల ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తమకు ఇళ్లు కేటాయించాలని, లేదంటే అప్పట్లో చెల్లించిన డీడీల సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
శ్రీకాకుళం నగరంతోపాటు ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో 2014-2019 మధ్య కాలంలో టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 430 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇంటి కోసం రూ.1లక్ష, 365 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం ఇంటికోసం రూ.50వేలు, 300 ఎస్‌ఎఫ్‌టీ ఇంటి కోసం రూ.25వేలు చొప్పున లబ్ధిదారుల నుంచి డీడీల రూపంలో తీసుకున్నారు. శ్రీకాకుళం నగర ప్రజలకోసం పాత్రునివలస వద్ద జీ+4 రీతిలో ఇళ్లను నిర్మించారు. ఫేజ్-1, ఫేజ్-2 కలిపి 1904 ఇళ్లను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 1280 ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. అయితే ప్రస్తుతం 460మంది మాత్రమే టిడ్కో ఇళ్లల్లో నివాసముంటున్నారు. మిగిలినవారు అక్కడ నివాసముండేందుకు విముఖత చూపించడంలేదు. అలాగే ఇంకా 624 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆమదాలవలసలో 528 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దాదాపు 80శాతం పూర్తిచేసి వదిలేశారు. పలాస-కాశీబుగ్గలో 912 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇచ్ఛాపురంలో 192 ఇళ్ల నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయి నిలిచిపోయింది.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో..
టిడ్కో ఇళ్లను పూర్తిచేసి.. లబ్ధిదారులకు అప్పగించే విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇళ్లను అప్పగిస్తే చంద్రబాబునాయుడికే పేరు వస్తుందన్న కారణంతో అప్పట్లో జగన్మోహనరెడ్డి.. టిడ్కో ఇళ్లపై నిర్లక్ష్యంగానే వ్యవహరించారన్నది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా.. గత ఐదేళ్లు లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోయినా.. కనీసం పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయించలేకపోయారు. ఇటీవల ఆ భవనాల కాంక్రీటు ఎలా ఉంది... నివాసానికి ఆమోదయోగ్యమా? కాదా ? అన్నది ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించారు. భవనాలు నూరు శాతం స్టాండర్డ్‌గా ఉన్నా.. ఇతర సదుపాయాల కోసం చేపట్టినవి పాడయ్యాయని తేలింది. ఎలక్ట్రికల్ వైరింగ్, ఉడ్ వర్క్(చెక్కతో తయారీచేసిన ద్వారబంధం, కిటికీ ఫ్రేమ్, తలుపులు వంటివి) పాడయ్యాయి. వాటిని తీసి మళ్లీ కొత్తవి అమర్చాల్సి ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో కొంతమంది ఇళ్ల కోసం, మరికొంతమంది తాము చెల్లించిన డీడీల నగదు వెనక్కి వచ్చేస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఇళ్లు మంజూరుకాని వారికి డీడీలను వెనక్కి ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, కార్యరూపం దాల్చలేదని పలువురు వాపోతున్నారు.
చెల్లించాల్సింది రూ.20కోట్లు పైబడి...
టిడ్కో ఇళ్ల కోసం అప్పట్లో అధికమంది అర్హులు డీడీలను చెల్లించారు. ఇళ్ల మంజూరు జరిగినా, నిర్మాణం చివరాఖరున వేగవంతం కాలేదు. పూర్తి చేసిన ఇళ్లను అప్పగించలేదు. పాత్రునివలస వద్ద ఇళ్లను అప్పగించినా సగం మంది లబ్ధిదారులు కూడా అక్కడకు వెళ్లలేదు. అయితే డీడీలు చెల్లించినవారికి అధికమందికి ఇళ్లు మంజూరు చేయలేకపోయారు. ప్రభుత్వం మారడంతో డీడీలను వెనక్కు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ డబ్బులను వెనక్కి ఇవ్వాలని.. మునిసిపాల్టీల నుంచి కలెక్టర్‌కు.. కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి.. ఇళ్లు మంజూరుకాని వారు అత్యధికంగా ఉన్నారు. వారికి వెనక్కి ఇవ్వాల్సిన మొత్తమే రూ.12కోట్లు. అలాగే పలాస-కాశీబుగ్గలో రూ.5కోట్లు, ఆమదాలవలసలో రూ.3కోట్లు, ఇచ్ఛాపురంలో రూ.1కోటి చెల్లించాల్సి ఉంది. అప్పట్లో అప్పు చేసి.. డీడీలు చెల్లించామని లబ్ధిదారులు వాపోతున్నారు. అప్పులకు వడ్డీ చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇళ్లు ఇవ్వకపోయినా.. అప్పట్లో ఇచ్చిన డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.