ఒడిశా వ్యర్థాలు.. ఏపీకి అనర్థాలు..
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:39 PM
ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి వస్తున్న మురుగునీరు పాతపట్నం వద్ద మహేంద్ర తనయ నదిలో కలుస్తుంది. దీంతో నదీ జలాలతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.
- మహేంద్ర తనయలో కలుస్తున్న ఒడిశా మురుగునీరు, చెత్త
- పాతపట్నంలో కలుషితమవుతున్న నదీ జలాలు
- భూగర్భ జలాలు కూడా..
- సాగుకు దూరమైన రైతులు
పాతపట్నం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి వస్తున్న మురుగునీరు పాతపట్నం వద్ద మహేంద్ర తనయ నదిలో కలుస్తుంది. దీంతో నదీ జలాలతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ మురుగు కాలువకు ఆనుకుని ఉన్న వందలాది ఎకరాల భూముల్లోకి వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల రైతులు ఆ పొలాల్లో పంటను పండించడం మానేశారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కేంద్రం పర్లాకిమిడి పట్టణాన్ని, మన రాష్ట్రంలోని పాతపట్నం పట్టణాన్ని మహేంద్ర తనయ నది వేరుచేస్తుంది. దాదాపుగా ఇవి జంట పట్టణాలుగా ఉంటాయి. రెండు పట్టణాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఒడిశా కొండల్లో పుట్టిన మహేంద్ర తనయ గజపతి జిల్లా మీదుగా పాతపట్నం నియోజకవర్గంలో ప్రవహించి హిరమండలం వద్ద వంశధారలో కలుస్తుంది. అటు ఒడిశాతో పాటు ఇటు ఆంధ్రాలో వేలాది ఎకరాలకు మహేంద్ర తనయ ద్వారా సాగు నీరు అందుతుంది. అయితే, పర్లాకిమిడి జిల్లా కేంద్రం కావడంతో అక్కడి అన్ని మురుగు కాలువల మార్గాలను మహేంద్ర తనయ వైపే చూపించారు. మురుగునీటితోపాటు ప్లాస్టిక్, ఆస్పత్రుల వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. ఫలితంగా ఈ నదీ జలాలు ఆంధ్రాలోకి వచ్చేసరికి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఆంధ్రాలో నది పొడవునా చెత్త, వ్యర్థాలు కనిపిస్తున్నాయి. దీంతో పాతపట్నం మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలైన బూరగాం, కాగువాడ, కొరసవాడ, సీది, పాసిగంగుపేట తదితర గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులు కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. వేసవిలో దాహం కేకలు చోటుచేసుకొనే రోజుల్లో మహేంద్ర తనయ నది వైపు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. కె.గోపాలపురం, హెచ్.గోపాలపురం గ్రామస్థులు నిత్యం దుర్గంధం మధ్యే జీవనం సాగిస్తున్నారు. ఒడిశా ప్రాంతంలో మురుగు నీరు పంట పొలాల్లోకి వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రైతులు ఆ కాలువకు ఆనుకొని ఉన్న పొలాల్లో చక్కగా పంటలు పండిస్తున్నారు. కానీ, ఆంధ్రాలోని పాతపట్నం మండల పరిధిలోకి వచ్చేసరికి ఈవ్యర్థాలను అడ్డుకునేందుకు గానీ, నియంత్రించేందుకు గానీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీని కారణంగా కె.గోపాలపురం, పాతపట్నం కాపువీధిరైతాంగానికి చెందిన సుమారు వంద ఎకరాలపంట భూముల్లో మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి సాగుకు పనికిరాకుండా తయారయ్యాయి. ప్రతీ ఎన్నికల్లో పాలకులు ఈ సమస్య పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు చేయడం, తరువాత మరచిపోవడం పరిపాటిగా మారింది.
చాలా ఇబ్బందులు పడుతున్నాం
ఒడిశా నుంచి వచ్చే వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలంలో కాలువ నుంచి వచ్చే తీవ్ర దుర్వాసనతో నరకం చూస్తున్నాం. ఒక్కోసారి మురుగు నీరు మా గ్రామంలోకి వచ్చేస్తుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
-శేఖర్, రైతు, కె.గోపాలపురం.
పాలకులు స్పందించాలి
గతంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లాం. ఆంధ్రా-ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరిగాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పటి పాలకులు స్పందించాలి.
-పైల బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షుడు, పాతపట్నం
ఆంధ్రాకు తీరని అన్యాయం
ఆంధ్రాకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒడిశా పాలకులు జిల్లాస్థాయి అధికారులతో చర్చలు జరిపి సత్వర చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
సైలాడ సతీష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, పాతపట్నం
త్వరలోనే సమస్య పరిష్కారం
ఇప్పటికే పర్లాకిమిడి పాలకులు, జిల్లాస్థాయి అధికారులతో చర్చలు జరిపాం. వారు సానుకూలంగా స్పందించారు. పర్లాకిమిడిలో వ్యర్థజలాల శుద్ధి ప్లాంటు ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. పనులు కూడా చేపడుతున్నారు. అతి త్వరలోనే మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది.
-మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం