Share News

విద్యావిధానంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:21 AM

‘విద్యా విధానంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల మాదిరి.. ఇంటి వద్ద తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉండాల’ని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యకార, పాడి పరిశ్రమ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

విద్యావిధానంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
కోటబొమ్మాళి: విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. (ఇన్‌సెట్‌లో.. )మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- విద్యావ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించింది

- ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు

- మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘విద్యా విధానంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల మాదిరి.. ఇంటి వద్ద తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉండాల’ని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యకార, పాడి పరిశ్రమ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ పాలనలో గాడితప్పిన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. శనివారం స్థానిక జిల్లాపరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. పూర్వపు విద్యార్థులు, ఉపాధ్యాయుల విరాళాలతో కోటబొమ్మాళి జడ్పీ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడం గర్వకారణమని కొనియాడారు. ‘వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలనలో విద్యావ్యవస్థ దెబ్బతింది. ‘నాడు-నేడు’ పేరిట పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టినా.. పనులు అసంపూర్తిగానే సాగాయి. విలీనం పేరిట గత ఐదేళ్లలో అనేక పాఠశాలలు మూతబడ్డాయి. వైసీపీ.. ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయలేదు. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. డీఎస్సీ ద్వారా 16వేల పోస్టుల నియామకాలకు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరచూ సమావేశమై.. విద్యార్థుల ప్రగతికి కృషి చేస్తారు. ఐఏఎస్‌ అధికారి రోణంకి గోవిందరావు, మాజీ డీజేపీ హెచ్‌జే దొర వంటివారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే. అటువంటి వారి స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలి. ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యంతో పాఠశాలలు, రహదారులు బాగుచేయనున్నాం. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామ’ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

చదువే.. ఆస్తి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచీ నా ఆస్తి చదువే. అయినా ఇప్పటి మా పిల్లలు టెక్నాలజీతో నేనే సరిపోన’ని చమత్కరించారు. పిల్లల నడవడిక, ఆహారం పద్ధతులు, తల్లిదండ్రులు పరిశీలించాలని సూచించారు. జిల్లాలోని 2,746 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, టీడీపీ నేతలు కింజరాపు హరివరప్రసాద్‌, బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్‌, కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, వెలమల విజయలక్ష్మి, పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:21 AM