Share News

స్వీప్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:10 AM

ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఓటరు జాబితా పరిశీలకులు, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ ఎంవీ శేషగిరిబాబు(ఐఏఎస్‌) తెలిపారు.

స్వీప్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఓటర్ల జాబితా పరిశీలకులు శేషగిరిబాబు

- ఓటరు జాబితా పరిశీలకులు శేషగిరిబాబు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఓటరు జాబితా పరిశీలకులు, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ ఎంవీ శేషగిరిబాబు(ఐఏఎస్‌) తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణ-2025పై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధ్యక్షతన సంబంధిత అధికారులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. సవరణ ప్రక్రియ సందర్భంగా వచ్చిన క్లెయిమ్‌లు, ఆమోదించినవి, తిరస్కరణకు గురైనవాటిపై ఆరా తీశారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పకడ్బందీ ఓటర్ల జాబితా తయారీపై పలు సూచనలు చేశారు. ‘అన్ని కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పెద్ద ఎత్తున ‘క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం’(స్వీప్‌) కార్యక్రమాలను నిర్వహించాలి. వర్క్‌షాప్‌లు, సదస్సులు, పోస్టర్‌లు, బ్యానర్‌లు, సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌లు చేపట్టాలి. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి’ అని శేషగిరిబాబు సూచించారు.

- తొలుత కలెక్టర్‌ జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వివరించారు. ఇప్పటికే డ్రాఫ్ట్‌ సిద్ధమయ్యిందని, జనవరి 5న తుది జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 18-19 సంవత్సరాల మధ్య యువకులు 19,246 మంది ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. మరో 39వేల మంది అర్హులు ఉన్నట్టు గుర్తించామని, ఏడాది పొడవునా వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఆర్వో అప్పారావు, వివిధ నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల డీటీలు, టీడీపీ నుంచి పీఎంజె బాబు, ముద్దాడ రామకృష్ణ, బీజేపీ నుంచి సురేష్‌సింగ్‌ బాబు, చల్లా వేంకటేశ్వరరావు, వైసీపీ నుంచి రౌతు శంకరరావు, సీపీఎం నుంచి ఎం.గోవిందరావు, కాంగ్రెస్‌ నుంచి ఈశ్వరి, బీఎస్పీ నుంచి అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:10 AM