Share News

నిఘా లేని రైల్వేస్టేషన్లే లక్ష్యంగా..

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:32 AM

పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. నిఘా లేని రైల్వేస్టేషన్లే లక్ష్యంగా గంజాయి రవాణాకు అక్రమార్కులు యత్నించారు. వారి వ్యూహం బెడిసికొట్టగా.. పోలీసులకు ఇద్దరు నిందితులు చిక్కారు. మరో నలుగురు పరారయ్యారు.

నిఘా లేని రైల్వేస్టేషన్లే లక్ష్యంగా..
పట్టుబడిన గంజాయి, నిందితులతో రైల్వే పోలీసులు

- గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు.. నలుగురు పరారీ

పలాస, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. నిఘా లేని రైల్వేస్టేషన్లే లక్ష్యంగా గంజాయి రవాణాకు అక్రమార్కులు యత్నించారు. వారి వ్యూహం బెడిసికొట్టగా.. పోలీసులకు ఇద్దరు నిందితులు చిక్కారు. మరో నలుగురు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పలాస రైల్వే సీఐ ఎ.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తరలించేందుకు ఆరుగురు సభ్యులు శుక్రవారం బొలేరో వాహనంపై కంచిలి రోడ్డు(సోంపేట) రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ స్టేషన్‌లో పోలీసుల నిఘా ఉండదని భావించారు. రైలులో ఎవరికీ అనుమానం రాకుండా మొత్తం 118 కిలోల గంజాయిని ఏడు లగేజీ బ్యాగుల్లో పెట్టి తరలించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఎం.మాల్యాద్రి వారి కదలికలు గుర్తించి.. నిఘా పెట్టారు. అనంతరం పలాస రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి అప్రమత్తం చేశారు. రైలులో ఆ బ్యాగులు ఎక్కించే సమయానికి మూకుమ్మడిగా దాడి చేసి గంజాయితో పాటు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. విషయం గుర్తించిన మరో నలుగురు గంజాయి స్మగ్లర్లు పరారీ అయ్యారు. వారి కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ పోలీసుల లెక్క ప్రకారం రూ.6లక్షలు ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.20లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఒడిశాకు చెందిన గంజాయి ముఠా సభ్యులు బిలాపగొమంగో, మందుదొళాయ్‌ను అరెస్టు చేసి పలాస తీసుకువచ్చామని, శనివారం విశాఖపట్నం రైల్వే కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐ ఎ.రవికుమార్‌ తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ప్రధాన నిందితుడు గోపాల్‌గొమాంగో కోసం గాలిస్తున్నామన్నారు. ఆయనకు బెంగుళూరులోని గంజాయి ముఠాతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తామని, రైళ్లలో గట్టి నిఘా పెట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, దానికి అనుగుణంగానే బరంపురం నుంచి విశాఖపట్నం వరకూ రైళ్లలో తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. దాడుల్లో ఎస్‌ఐ ఎండి.షరీఫ్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:32 AM