Share News

ముసురేసింది

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:07 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. జిల్లా అంతటా గురువారం ముసురేసింది. రెండు రోజులుగా అడపాదడపా జల్లులు పడగా.. గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

ముసురేసింది
కళింగపట్నం వద్ద కోతకు గురైన తీరం... శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షం

- జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

- పంట నష్టం తప్పదని రైతుల ఆందోళన

- తగ్గిన ఉష్ణోగ్రతలతో వణుకుతున్న ప్రజలు

- తీరంలో ఎగిసి పడుతున్న అలలు..

శ్రీకాకుళం/హరిపురం/గార/ నరసన్నపేట, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. జిల్లా అంతటా గురువారం ముసురేసింది. రెండు రోజులుగా అడపాదడపా జల్లులు పడగా.. గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గార మండలంలో 14మి.మీ. వర్షపాతం నమోదైంది. పోలాకిలో 7, సరుబుజ్జిలిలో 6.75, కోటబొమ్మాళిలో 5.75, శ్రీకాకుళంలో 5.5, నరసన్నపేటలో 5.5, ఆముదాలవలసలో 5.25, ఎచ్చెర్లలో 4.75, ఎల్‌.ఎన్‌.పేట 4.5, లావేరులో 2.25, రణస్థలంలో 2.00, సారవకోటలో 2.00, హిరమండలం, జి.సిగడాం, పొందూరు ప్రాంతాల్లో 1.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో వర్షం కారణంగా నగర ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలకు గురయ్యారు. అలాగే రెండు రోజులుగా తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం జిల్లాలో 21 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలితో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. చిరుజల్లులతో పాటు చలిగాలులు వీయడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

కోతకు గురవుతున్న తీరం

జిల్లాలో తీరప్రాంతం అధికంగా ఉండడంతో శీతల గాలులు తోడయ్యాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. సుమారు ఆరుమీటర్లు ఎత్తులో అలలు ఎగిసి పడ్డాయి. గార మండలం బందరువానిపేట వద్ద, మందస మండలం గంగువాడ వద్ద సుమారు పది మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. గుంగువాడ, కళింగపట్నం తీరం వద్ద కొంతమేర కోతకు గురైంది. తీర ప్రాంతంలో రక్షణ కోసం నాటిన వృక్షాలు నేలమట్టమవటంతో తీరంలో రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గెడ్డూరు, ఎంగంగువాడ వంటి తీరప్రాంతాల్లో ఇసుకతెన్నెలు కోతకు గురవటంతో ఆయా ప్రాంతవాసులు కంటిమీదకునుకు లేకుండా కాలంవెళ్లదీస్తున్నారు. అలాగే కళింగపట్నం, బందరువానిపేట, కొవ్వాడ నుంచి బారువ వరకు తీరప్రాంత మత్స్యకారులకు సముద్రంలో చేపలవేటకు వెళ్లలేకపోయారు. సముద్రపు అలలు, ముందుకు రావడంతో ఒడ్డున ఉన్న పడవలు, తెప్పలు, వలలు, ఒడ్డున సురక్షిత ప్రదేశంలో మత్స్యకారులు భద్రపరిచారు.

తడిచిన పంట

వర్షం కారణంగా శ్రీకాకుళం రూరల్‌, గార, పోలాకి, నరసన్నపేట, మందస, పలాస, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, పాతపట్నం, ఆమదాలవలస, రణస్థలం తదితర మండలాల్లో వరికుప్పలు తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల వరిపంట నేలకొరిగింది. కళ్లాల్లో ఉంచిన ధాన్యం భద్రపరిచేందుకు రైతులు ఆపసోపాలు పడ్డారు. పంట చేతికి అందే సమయంలో తుఫాన్‌ల కారణంగా.. తమకు నష్టం తప్పేలా లేదని వాపోతున్నారు. అలాగే మందస ఏజెన్సీ లో విస్తారంగా నాటిన పత్తిపంటపై వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. బుడార్సింగి, చీపి, అంబటికంబారం, చిన్నకోష్ట, గౌడగురంటి తదితర గ్రామాల్లో సుమారు పదివేల ఎకరాల్లో నాటిన పత్తిపంట తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:07 AM