Road accident సంతోషం.. అంతలోనే విషాదం
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:49 AM
"Road Accident in Srikakulam District" తమ ఒక్కగానొక్క కుమార్తెకు పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది. ఆ ఆనందంతో కుటుంబ సభ్యులంతా సోమవారం రాత్రి సంతోషంతో.. సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ఇంట విషాదం అలుముకుంది.
దైవ దర్శనానికి వెళ్తూ.. ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు
డ్రైవర్ నిద్రమత్తే కారణం
బాధితులంతా విశాఖపట్నం, భద్రాచలం వాసులే
చిన్నకొజ్జిరియా కూడలి వద్ద ఘటన
కంచిలి, డిసంబరు 24 (ఆంధ్రజ్యోతి): తమ ఒక్కగానొక్క కుమార్తెకు పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది. ఆ ఆనందంతో కుటుంబ సభ్యులంతా సోమవారం రాత్రి సంతోషంతో.. సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ఇంట విషాదం అలుముకుంది. దైవదర్శనం కోసం మంగళవారం ఉదయం కారులో ఒడిశాకు వారంతా బయలుదేరారు. మార్గమధ్యలో వారి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కంచిలి మండలం చిన్న కొజ్జిరియా కూడలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా సీతమ్మధారకు చెందిన ముత్తా వెంకట రంగ రాజేష్ గుప్తా కుమార్తె నేహా గుప్తా(18)కు పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది. దీంతో రాజేష్‌తో పాటు భార్య లావణ్య(43), కుమార్తె నేహాగుప్తా, తల్లి సుబ్బలక్ష్మి, తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన తోడల్లుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు(49), మరదలు రాధిక సోమవారం రాత్రి బీచ్‌లో కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. వీరంతా మొక్కు తీర్చుకునేందుకు ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లోని తరిణి మాత దేవాలయానికి మంగళవారం వేకువజామున 5గంటల సమయంలో విశాఖపట్నం నుంచి కారులో బయలుదేరారు. ఉదయం 9 గంటల సమయంలో కంచిలి మండలం చిన్న కొజ్జిరియా సమీపంలోకి వచ్చే సరికి కారు డ్రైవింగ్ చేస్తున్న రాజేష్ కాస్త నిద్ర మత్తుకి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొని బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న వారందరూ కుదుపులకు గురై, తలలకు బలమైన గాయాలయ్యాయి. వీరంతా కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని బయటకు తీశారు. ఘటనా స్థలంలోనే లావణ్య మృతి చెందింది. ఆమె కపాలం భాగం తెగి.. రోడ్డుపై పడింది. మిగిలిన క్షతగాత్రులను 108 వాహనం, హైవే అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. మార్గమధ్యలో నేహా గుప్తా, సోమేశ్వరరావు మృతి చెందారు. రాధిక పరిస్థితి విషమంగా ఉండటంలో ఆమెను వెంటనే శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ గుప్తా, తల్లి సుబ్బలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి.
అయ్యో.. దేవుడా?
కుటుంబ సభ్యుల మృత దేహాలను చూస్తూ రాజేష్ రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. దేవుడి దర్శనానికి వెళుతుంటే ఇలా తనవారిని దూరం చేస్తాడా.. దేవుడే లేడంటూ ఆయన బోరుమనడం అందరినీ కంటతడి పెట్టించింది. తన కళ్లముందే.. తన చేతులారా.. తన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని లబోదిబోమన్నాడు. లావణ్య, నేహా గుప్తా, సోమేశ్వరరావుల మృతదేహాలను సోంపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సోంపేట ఆసుపత్రి వద్దకు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు, సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పారినాయుడు చేరుకుని, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, సోంపేట, కంచిలి ఎంపీపీలు ఎన్.దాసు, దేవదాస్ రెడ్డి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.