Share News

ఇసుక... ఉచితమే!

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:32 PM

వైసీపీ ప్రభుత్వ పాలనలో గత ఐదేళ్లూ ఇసుక అక్రమాలతో రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార, మహేంద్రతనయ నదుల్లో ఇసుకను గ్రామస్థాయి వైసీపీ నాయకులు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది.

ఇసుక... ఉచితమే!

- తవ్వకాలకు ప్రదేశాల గుర్తింపు

- ట్రాక్టర్లు, ఎద్దుల బళ్లకు అవకాశం

మెళియాపుట్టి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ పాలనలో గత ఐదేళ్లూ ఇసుక అక్రమాలతో రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార, మహేంద్రతనయ నదుల్లో ఇసుకను గ్రామస్థాయి వైసీపీ నాయకులు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. కాగా కొంతమంది కూటమి నాయకులు సైతం ఇసుక విక్రయాలు సాగిస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అమరావతిలో సీఎం చంద్రబాబు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇసుక ఉచిత విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశించారు. ఇసుక సరఫరాలో లోపాలపై చర్చించారు. ‘ఇసుక లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బళ్లలో ఇసుక తరలిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంద’ని ఎమ్మెల్యేలు తెలిపారు. దీంతో ఇకపై ట్రాక్టర్ల ద్వారా అనుకూలమైన ప్రాంతాల్లో ఇసుక తవ్వి.. తరలించుకోవచ్చని సీఎం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అన్ని ప్రాంతాలకూ సులువుగా ఉచిత ఇసుక వెళ్లే అవకాశం ఉంది. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, పాతపట్నం, కొత్తూరు మండలాల్లో మండలాల్లో ఇసుక అధికంగా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేంద్రతనయ నదిలో ఇసుకను మెళియాపుట్టి, మందస, సోంపేట, పలాస మండలాలకు తరలించనున్నారు.

ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు

ప్రస్తుతం నైరా, రామకృష్ణాపురం, చెవ్వాకులపేట వద్ద ఇసుక స్టాక్‌ పాయింట్లు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, ఎద్దుల బళ్లతో ఇసుక తరలించేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను భూగర్భ గనులశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. మహేంద్రతనయ, నాగావళి, వంశధార నదుల పరిధిలో సుమారు 250 ప్రాంతాల్లో ఇసుక తవ్వుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ట్రాక్టర్ల యజమానులు, భవన కార్మికులతోపాటు నిర్మాణదారులకూ ఊరట లభించనుంది. జిల్లాలో సుమారు 40వేల ట్రాక్టర్లు ఉన్నాయి. ఆయా డ్రైవర్లు, కూలీలందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లు షెడ్‌లో ఉంచాం

అప్పు చేసి రూ.10లక్షలతో ట్రాక్టర్‌ కొన్నాను. గత ఐదేళ్ల పాటు ఇసుక రవాణా చేసుకోనే అవకాశం లేక ట్రాక్టర్‌ షెడ్‌లోనే ఉంచాం. దమ్ములు, దుక్కికి మాత్రమే వినియోగించాం. కూటమి ప్రభుత్వం.. ఉచితంగా ఇసుక తరలించే అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. గతంలో మా గ్రామంలో సుమారు 40 ట్రాక్టర్లు ఉండగా.. ప్రస్తుతం పదే ఉన్నాయి.

ఎన్‌.ఉమాపతి, ట్రాక్టర్‌ యజమాని, జలగలింగుపురం, మెళియాపుట్టి

............

కార్మికులకు కూలి దొరుకుతుంది

ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం ఎక్కడ ఇసుక దొరుకుతుందో అక్కడ తీసుకునే వెసులుబాటు ఇవ్వడం వల్ల అనందంగా ఉంది. ప్రతిరోజు కూలి దొరుకుతుంది.

నిరంజన్‌, మేస్ర్తీ, మెళియాపుట్టి

Updated Date - Oct 22 , 2024 | 11:32 PM