Share News

పల్లెవెలుగు బస్సులో షర్మిల

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:16 AM

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఇచ్ఛాపురం వెళ్లేందుకుగానూ కంచిలి మండలం జాతీయరహదారి అంపురం వద్ద ఆమె ఓ పల్లెవెలుగు బస్సు ఎక్కారు.

పల్లెవెలుగు బస్సులో షర్మిల
పల్లెవెలుగు బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతున్న షర్మిల

- అంపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రయాణం

- ప్రయాణికులతో మాటామంతీ

టెక్కలి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఇచ్ఛాపురం వెళ్లేందుకుగానూ కంచిలి మండలం జాతీయరహదారి అంపురం వద్ద ఆమె ఓ పల్లెవెలుగు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి రాకేష్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు కూడా బస్సులో 23కిలోమీటర్లు మేర ప్రయాణించారు. ప్రయాణికులతో అరగంట పాటు షర్మిల మాట్లాడుతూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై ఆరాతీశారు.

- బస్సులో పక్క సీట్లో కూర్చొన్న నీలవేణి అనే ప్రయాణికులతో షర్మిలతో మాట్లాడారు. ‘తల్లీ నమస్తే. నువ్వు ఏమి చేస్తుంటావు. నీ భర్త ఏమి చేస్తారు. వ్యవసాయానికి సాగునీరు ఉందా?. ఆదాయం ఎంత వస్తోంద’ని షర్మిల అడిగారు. తాను గృహిణిగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నానని ప్రయాణికురాలు నీలవేణి తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు పెరగ్గా ఆదాయం తగ్గిందన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మాదిరి ఈ రాష్ట్రంలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. తప్పకుండా అమలు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.

.....................

- బస్సులోని వెనుక సీట్లో ఉన్న బారువ ప్రాంతానికి చెందిన మరో ప్రయాణికుడు బి.సదాశివరావును ‘అన్నా బాగున్నారా’ అంటూ షర్మిల ఆప్యాయంగా పలకరించారు. బాగున్నా అమ్మా అంటూ సదాశివరావు కూడా ప్రతి నమస్కారం చేశారు. ‘ఈ ఐదేళ్లలో కొత్త కాలనీలు ఏమైనా ఇచ్చారా? మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? మద్యపాన నిషేధం హామీ గుర్తుందా?’ అని షర్మిల అడిగారు. దీనిపై సదాశివరావు బదులిస్తూ కొత్త కాలనీలు పెద్దగా లేవమ్మా అని తెలిపారు. నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని, మద్యపాన నిషేధం హామీ గాలిలో కలిసిపోయిందని వివరించారు.

..................

- బస్సులో బారువ కొత్తూరుకు చెందిన సిరిగిడి ఈశ్వరమ్మ అనే ప్రయాణికురాలిలో షర్మిల మాట్లాడారు. ‘మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా?. మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశారా?. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి’ అని ఆరా తీశారు. దీనిపై ప్రయాణికులు ఈశ్వరమ్మ మాట్లాడుతూ.. ఓట్లు అడిగినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే వచ్చారని.. తర్వాత కనిపించలేదని తెలిపారు. మా ప్రాంతంలో అంతంతమాత్రమే అభివృద్ధి చేశారని, ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో కుటుంబ పోషణ భారమవుతోందన్నారు.

.................

ఇలా.. పాపాలపుట్టుగకు చెందిన బి.పురుషోత్తం, జాడుపూడికి చెందిన కళ్యాణి తదితరులతో షర్మిల మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూనెలు, చక్కెర తదితర నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, గ్యాస్‌, విద్యుత్‌, బస్సు చార్జీలు బాగా పెరిగినట్టు ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నానని వివరించారు.

Updated Date - Jan 24 , 2024 | 12:16 AM