Share News

ఒంటరి ఇల్లు, మహిళలే టార్గెట్‌

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:40 AM

జిల్లాలో ఒంటరి ఇల్లు, మహిళలను టార్గెట్‌ చేస్తూ పలు చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ.33.3లక్షలు, 31 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు.

ఒంటరి ఇల్లు, మహిళలే టార్గెట్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

- పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు

- నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం

శ్రీకాకుళం క్రైం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒంటరి ఇల్లు, మహిళలను టార్గెట్‌ చేస్తూ పలు చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ.33.3లక్షలు, 31 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ‘సరుబుజ్జిలి జంక్షన్‌లో శనివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అదపాకకు చెందిన పిన్నింటి సంతోష్‌, గట్టిమ ఆనంద్‌, తాలాడకు చెందిన రాగోలు రాంబాబు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించాం. ఒంటరి ఇల్లు, మహిళలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. జిల్లాలోని సరుబుజ్జిలిలో ఒకటి, ఆమదాలవలస పరిధిలో రెండు, పొందూరు పరిధిలో మూడు, జలుమూరు, నరసన్నపేట పరిధిలో రెండేసి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, టెక్కలి స్టేషన్‌ పరధిలో ఒక్కొక్క దొంగతనాలు చేసినట్టు గుర్తించాం. ఆ ముగ్గురినీ అరెస్టు చేశాం. చోరీ చేసిన నగదు, బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నామ’ని ఎస్పీ తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ప్రశంసించారు.

గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలి

‘జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలి. మహిళలు, చిన్నారుల వేధింపుల కేసుల దర్యాప్తు వేగంగా పూర్తిచేయాల’ని ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ ప్రజా ఫిర్యాదులు, ఎన్డీపీఎస్‌ మిస్సింగ్‌, ప్రాపర్టీ, గ్రేవ్‌, సైబర్‌, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై చర్చించారు. ఎస్పీ మాట్లాడుతూ ‘నిశితమైన కేసుల్లో సాక్ష్యాధారాలతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. గ్రామ సందర్శన చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. మాదకద్రవ్యాలు వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల’ని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు వివేకా ఆనంద్‌, అప్పారావు, రాజశేఖర్‌, ప్రసాదరావు, ఏవో గోపీనాధ్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:41 AM