Share News

పలాసలో కుప్పకూలిన టెంట్లు..

ABN , Publish Date - May 13 , 2024 | 12:21 AM

పలాసలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద అలజడి రేగింది. ఆదివారం వేకువజామున భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీయడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు మొత్తం కుప్పకూలిపోయాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.

పలాసలో కుప్పకూలిన టెంట్లు..
ఈదురుగాలులకు కుప్పకూలిన టెంట్లు, ఇన్‌సెట్‌లో పాఠశాల వరండాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల సిబ్బంది

- గాలీవాన బీభత్సంతో ఇబ్బందులు

- ఎన్నికల సామగ్రి పంపిణీకి అవరోధాలు

- సాయంత్రం 6 గంటలైనా కేంద్రాలకు చేరని బస్సులు

- అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు

పలాస, మే 12: పలాసలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద అలజడి రేగింది. ఆదివారం వేకువజామున భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీయడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు మొత్తం కుప్పకూలిపోయాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. దీంతో ఎన్నికల సామగ్రి పంపిణీకి తీవ్ర అవరోధం ఏర్పడింది. ఎన్నికల అధికారి, ఆర్డీవో భరత్‌నాయక్‌ ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయంగా మైదానం పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే పక్కపక్కనే పంపిణీ కేంద్రాలు పెట్టడంతో గందరగోళం ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలి. కాగా.. గాలీవాన బీభత్సం నేపథ్యంలో అవరోధం ఏర్పడడం.. అధికారుల మధ్య సమన్వయలోపంతో సాయంత్రం 6 గంటలైనా పోలింగ్‌ కేంద్రాలకు బస్సుల్లో సామగ్రి తరలించలేకపోయారు. గంటలపాటు నిరీక్షించలేక.. సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఎన్ని గంటలకు చేరుకుంటామని.. అర్ధరాత్రి వరకూ సామగ్రి సర్దుకోవాలా? అని అసహనం చెందారు.

Updated Date - May 13 , 2024 | 12:21 AM