ఈ పాపం.. వైసీపీదే
ABN , Publish Date - May 20 , 2024 | 11:55 PM
వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. ఈ నదులు అనుసంధానం చేసి జిల్లాలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలని టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారు. రూ.6,400కోట్లుతో 2019 మార్చి నెలలో టెండర్ల ప్రక్రియ చేపట్టారు.

- నదుల అనుసంధానానికి మంగళం
- రూ.6,400కోట్లు టెండర్లు రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- కూటమి అధికారంలోకి వస్తేనే.. కల నెరవేరుతుందని రైతుల ఆశ
(టెక్కలి)
వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. ఈ నదులు అనుసంధానం చేసి జిల్లాలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలని టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారు. రూ.6,400కోట్లుతో 2019 మార్చి నెలలో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. అప్పట్లో బీఎస్‌ఆర్ కనష్ట్రక్షన్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. అందులో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వీటి ఇన్‌స్పెక్షన్‌కు సంబంధించి రూ.5కోట్లు నిధులను సైతం కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే... టీడీపీ హయాంలో 25శాతం లోపల జరిగిన పనులన్నీ రద్దు చేసింది. దీంతో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కథ కంచికి చేరింది. ఏటా సుమారు 200 టీఎంసీల నీరు వంశధార నది ద్వారా సముద్రంలో వృఽథాగా కలుస్తోంది. దీంతో ఇంటర్ లింకింగ్ ద్వారా తక్కువ నీటివనరులు గల బాహుదా నదికి వంశధారను అనుసంధానం చేయాలనే ప్రయత్నాలను వైసీపీ ప్రభుత్వం నీటిపాలు చేసింది. వంశధార, బాహుదా నదులు అనుసంధానం చేస్తే.. పాతపట్నం, మెళియాపుట్టి, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు లక్షా50వేల ఎకరాలకు సాగునీరందేది. ఈ నదులను అనుసంధానం చేయాలని పలాస, టెక్కలి డివిజన్ల ప్రజాప్రతినిధులు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించి 2018లో రూ.6,400 కోట్ల నిధులు కేటాయించారు. నదుల అనుసంధానం జరుగుతుందని ఈ ప్రాంత రైతులు ఎంతో సంబరపడ్డారు. కానీ ఇంతల్లో సార్వత్రిక ఎన్నికలు రాగా.. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ ఐదేళ్లు నదుల అనుసంధానం ఊసే లేదు. పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కూడా దీనిపై నోరుమెదపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాతపట్నం ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వంశఽధార, బాహుదా నదుల అనుసంధానానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. టెక్కలి, పలాస డివిజన్ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయే కూటమి అధికారంలోకి వస్తేనే.. తమ కల నెరవేరుతుందని భావిస్తున్నారు.