Share News

ఆ ఐదేళ్లూ.. దుర్భరం

ABN , Publish Date - Aug 08 , 2024 | 11:29 PM

ఆధునిక ప్రపంచంలోనూ గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏకు సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించి.. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి వాటిని వినియోగించేవారు. వైసీపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించడంతో గత ఐదేళ్లలో గిరిజనులు ఆర్థికాభివృద్ధి మరింత కుంటుపడింది.

ఆ ఐదేళ్లూ.. దుర్భరం
అభివృద్ధికి దూరంగా గూడ గిరిజన గ్రామం.. ఇన్‌సెట్‌లో డోలీపై గర్భిణిని మోసుకెళ్తున్న దబ్బగూడ గిరిజనులు(ఫైల్‌)

- గిరిజనులు దరిచేరని సంక్షేమ పథకాలు, రుణాలు

- సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించిన వైసీపీ సర్కారు

- సమస్యలు పట్టించుకునే తీరికేలేని అప్పటి పాలకులు

- కూటమి ప్రభుత్వం వచ్చాక చిగురిస్తున్న ఆశలు

- ఇటీవల గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష

- నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

(మెళియాపుట్టి)

వారు అడవితల్లి బిడ్డలు. అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. ఎంత కష్టమైనా.. చెదరని ఆత్మవిశ్వాసం వారి సొంతం. కాగా.. తరాలు మారుతున్నా.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వారి తలరాతలు మాత్రం మారడం లేదు. కనీస రహదారులు లేక.. సక్రమంగా వైద్యసేవలు అందక.. ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఐటీడీఏ సైతం దూరమైన దుస్థితి నెలకొంది. సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లడంతో అభివృద్ధి కనుమరుగైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా.. తమ అభివృద్ధిపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని గిరిజనం వేడుకుంటోంది. శుక్రవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల జీవన విధానం.. దుర్భర దుస్థితిని తెలుసుకుందాం.

.....................

ఆధునిక ప్రపంచంలోనూ గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏకు సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించి.. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి వాటిని వినియోగించేవారు. వైసీపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించడంతో గత ఐదేళ్లలో గిరిజనులు ఆర్థికాభివృద్ధి మరింత కుంటుపడింది. రాజ్యంగం నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతాల్లో స్థిరనివాసం కలిగిన 33 తెగలు సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిజనులు, అడవి బిడ్డలుగా పిలుస్తున్నారు. వీరు అటవీ ఉత్పత్తుల విక్రయాల ద్వారా జీవనం సాగిస్తున్నారు. కాగా.. తరాలు మారుతున్నా.. గిరిజనుల తలరాతలు మారడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1498 గ్రామాల్లో 39,112 కుటుంబాలకు చెందిన 1,66,118 మంది గిరిజనులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చాలా గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్య సదుపాయాలు, కనీసస్థాయిలో వసతులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాకు ఐటీడీఏ లేక..

వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఐటీడీఏ లేకుండా చేసింది. జిల్లా పునర్విభజనలో భాగంగా పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేసింది. దీంతో పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట ఐటీడీఏ కూడా పార్వతీపురం జిల్లాలో విలీనమైంది. పీవో కార్యకలాపాలు అధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనే కొనసాగుతున్నాయి. దీంతో జిల్లాలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు ఐటీడీఏ మంజూరు చేయాలని గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదిగో.. ఇదిగో.. అంటూ కాలయాపన చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతపట్నంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేసే అవకాశం ఉందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన విద్యను వదిలేశారు..

ప్రాథమికస్థాయిలోనే చిన్నారులకు విద్య అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో జీపీఎస్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారు. కాగా.. వైసీపీ పాలనలో విలినం పేరుతో పాఠశాలలు మూతపడడంతో గిరిజనులు విద్యకు దూరమయ్యారు. మెళియాపుట్టి మండలంలోని దిబ్బగూడ, ఎగువ బందపల్లి, బాలేరు, తోవూరు, నాయుడు పోలూరు, గూడ తదితర పాఠశాలలు విలీనం చేశారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం 110 జీపీఎస్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ‘నాడు-నేడు’ పేరుతో మూడో విడతలో నిధులు కేటాయించి.. పాఠశాలలు అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. కానీ, రెండో విడత పనులే పూర్తికాలేదు. చాలా పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

తప్పని డోలీమోత

గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. ఇప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో చాలా గ్రామాల్లో డోలీ మోత తప్పడం లేదు. సకాలంలో వైద్యసేవలు అందక మాతా శిశుమరణాలు సంభవిస్తున్నాయి. మెళియాపుట్టి మండలంలో కేరాసింగి, గూడ, చందనగిరి, అడ్డివాడ, డబ్బా గుడ్డి గ్రామాలకు రహదారి లేదు. వాహనాలు వెళ్లలేని దుస్థితి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో డోలీలోనే రోగులను మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

- హిరమండలం మండలంలో కిరడివలస, బొంగిగూడ, మర్రిగూడ, సారవకోట మండలంలో అశోకం, బురుజువాడ, గూడ, బొంతుగూడ, కొత్తూరు మండలంలో అద్దంగి, అల్తి, మందస మండలంలో భావనసాయి, గుడ్డి కాలనీ, లలితాపురం, మధుర గుడ్డియాలి, కొండమెర గ్రామాలకు రహదారులు లేక.. డోలీలోనే రోగులను మోసుకెళ్లాల్సి వస్తోంది.

తాగునీటికి ఇబ్బందులు

జిల్లాలో కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఊట నీరే తాగుతున్నారు. ఐటీడీఏ పరిధిలో 234 రక్షిత నీటి పథకాలు, 250 వరకు సోలార్‌ తాగునీటి పథకాలు ఉన్నాయి. 2014లో ఏర్పాటు చేసిన పథకాలు పాడైనా.. మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులతో జల్‌జీవన్‌ పనులు చేస్తున్నా.. అధికంగా గ్రామాలకు బోర్‌వెల్‌ లారీలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పనులు పూర్తికాక గిరిజనులకు తాగునీటికి అవస్థలు పడుతున్నారు.

రహదారులు లేక అవస్థలు

గిరిజన గ్రామాలకు రహదారులు లేవు. గిరిజన ప్రాంతాల్లో 181 రహదారులకు సుమారు రూ.220 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసినా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా.. కొంతమంది వైసీపీ నాయకులకు పనులు అప్పగించారు. వారు పనులు పూర్తిచేయకుండా బిల్లులు చేయించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేయని పరిస్థితి నెలకొంది.

ట్రైకార్‌ నిధులు లేవు:

గత ప్రభుత్వం గిరిజనుల కోసం ట్రైకార్‌ సంస్థను ఏర్పాటు చేసినా.. నిధులు మంజూరు చేయలేదు. రుణాలు అందే పరిస్థితి లేక గిరిజనులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అప్పు తీసుకుని సాగు చేయడంతో మరింత నష్టపోతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు ట్రైకార్‌ రుణాలు మంజూరు చేసేవారు. ఆ డబ్బులతో స్వయం ఉపాధి పొందేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రైకార్‌ రుణాల ఊసేలేదు.

కనిపించని జిసిసి సేవలు

గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరతోపాటు.. వారికి రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన జీసీసీ సేవలు కూడా కనుమరుగయ్యాయి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక గిరిజనులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

నెట్‌వర్క్‌ లేక అవస్థలు

గిరిజన గ్రామాలకు నెట్‌వర్క్‌ లేక ప్రభుత్వ పఽథకాలకు దూరమవుతున్నారు. పింఛన్లు, రేషన్‌తోపాటు సచివాలయ సేవలు అందక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 339 గ్రామాలకు సిగ్నల్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెళియాపుట్టి మండలంలో బందపల్లి, బాణాపురం, భరణికోట, కేరాసింగి, పడ్డ, దీనబంధుపురం, జోడూరు, పెద్ద లక్ష్మీపురంలో సిగ్నల్‌ సమస్య వేధిస్తోంది. చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

కొనసాగిస్తున్న సంప్రదాయాలు

గిరిజన పండగలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. గిరిజనోత్పత్తులు లభ్యమయ్యే సీజన్లకు అనుగుణంగా పండగలు గోచరిస్తుంటాయి. కందులు, ఉలవలు, సామలు, ఊదలు, కొర్రలు, గంటెలు, జినుములు, ఉలిసీలు, అనపలు ఇలా వివిధ రకాల గిరిజనులు పంటలను వేస్తారు. ఈ పంటలు చేతికందే సమయంలో ఉత్సాహంగా ‘కంది కొత్తల’ పండగను జరుపుకుని కొత్తగా పండిన వివిధ రకాల పంటల ఫలసాయాలను వండుకుని తింటారు. సంక్రాంతి సమయంలో ఇటుక పండగను చేసుకుంటారు. ఆదివాసీ మహిళలు థింసా నృత్యాలతో ఆకట్టుకుంటారు. డప్పు, డోలు, సొన్నాయి వంటి అనేక వాయిద్య పరికరాలు వినియోగిస్తూ సంబరాలు చేసుకుంటారు. ఆదరణ తగ్గుతున్నా.. సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగిస్తుండడం గమనార్హం.

కూటమి ప్రభుత్వంపై ఆశలు

గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించిన 11 సంక్షేమ పథకాలను రద్దు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు.. గిరిజనశాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు గ్రామాలకు రహదారులు సౌకర్యం, గర్భిణులకు వసతిగృహాలు, ఫీడర్‌ అంబులెన్స్‌లు, సబ్‌ప్లాన్‌, ట్రైకార్‌ రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇవ్వడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

..........................

జిల్లాలో ఆదివాసీ దినోత్సవం జరపాలి

జిల్లాలో ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలి. ఏటా సీతంపేటలో ఈ దినోత్సవం నిర్వహించడం వల్ల జిల్లా గిరిజనులకు ఉపయోగం లేదు. జిల్లా పునర్విభజన తర్వాత సీతంపేట.. పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయడంతో.. అక్కడే రెండు ఐటీడీఏలు కొనసాగుతున్నాయి. జిల్లాకు ఐటీడీఏ లేని పరిస్థితి నెలకొంది. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందని దుస్థితి ఏర్పడింది. నేషనల్‌ ప్రాజెక్టు పేరుతో గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. 47 ఆశ్రమ పాఠశాలకు క్లాస్‌పోర్‌ ఉద్యోగులు లేక విద్యార్థులే వంటలు చేసుకుంటున్నారు.

- వాబ యోగి, రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ సంఘం పరిషత్‌ ఉపాధ్యక్షుడు

..........................

సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించాలి

గిరిజన గ్రామాల్లో సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చుచేయాలి. గత ప్రభుత్వం ్ఠ్ఠగిరిజనులకు పూర్తిగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి ఎన్టీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందనే నమ్మకం ఉంది. పరిశ్రమల స్థాపనకు చేయూతనివ్వాలి.

- సీహెచ్‌ శాంతారావు, గిరిజన ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి

Updated Date - Aug 08 , 2024 | 11:29 PM