శ్రీకాకుళంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:22 PM
శ్రీకాకుళం నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోంది. ఇరుకైన రహదారులు, వ్యాపార సముదాయాలకు పార్కింగ్ ప్రదేశం లేకపోవడంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు.
- ఈ నెల 12 నుంచి ఆంక్షలు అమలు
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 8: శ్రీకాకుళం నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోంది. ఇరుకైన రహదారులు, వ్యాపార సముదాయాలకు పార్కింగ్ ప్రదేశం లేకపోవడంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు.. ప్రత్యామ్నాయ మార్పులు సూచించారు.
- ఆమదాలవలస - ఆదివారంపేట మీదుగా నగరంలోకి వచ్చే ఆటోలు.. బలగ రిమ్స్ ఆస్పత్రి జంక్షన్ వద్ద కుడివైపునకు టర్న్ తీసుకోవాలి. రిమ్స్ ఆస్పత్రి, శాంతినగర్ కాలనీ, ఆర్ట్స్ కాలేజీ మీదుగా అంబేడ్కర్ జంక్షన్‌కు చేరుకోవాలి.
- ఆటోలు ఆర్టీసీ కాంప్లెక్స్ వైపునకు నియంత్రించడం వల్ల.. నిత్యం రద్దీగా ఉండే జడ్జి బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రమాదాలను నియంత్రించడం సాధ్యపడుతుంది.
- శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్ బస్సులు బలగ-ఆదివారంపేట మీదుగా కొత్తరోడ్డు వద్దకు చేరుకుని వెళ్లాలి. దీని వల్ల సాయంత్రం సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్, డేఅండ్‌నైట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ సులభతరమవుతుంది.
- సింహద్వారం - కిమ్స్ ఆస్పత్రి మీదుగా పట్టణంలో ఆర్ట్స్ కాలేజీ వైపు వెళ్లే వాహనదారులు.. సింధూర ఆస్పత్రి జంక్షన్ వద్ద టర్న్ తీసుకుని.. కాలేజీ రోడ్డుకు చేరుకోవాలి. దీనిని వన్‌వే రోడ్డుగా నిర్ధారించారు. ఈ నెల 12 నుంచి ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.