అమ్మో..చలి
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:19 AM
జిల్లాలో చలి... మంచు ప్రభావం ఒక్కసారిగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
- వైరస్ వ్యాప్తికి ఇదే సీజన్
- జాగ్రత్తలు పాటించపోతే కష్టం
- వృద్ధులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం
నరసన్నపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి... మంచు ప్రభావం ఒక్కసారిగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. లేదంటే వివిధ రకాల వ్యాధులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. చలి త్రీవత కారణంగా ఇన్‌ప్లూమెంజా, పాల్సీఫారం వంటి వైరస్‌లు దాడి చేస్తాయి. దీనివల్ల న్యూమోనియా సోకి ఊపరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చేతివేళ్లు, కాలివేళ్లు, చెవులు తదితర భాగాలకు రక్త ప్రసరణ తగ్గి... చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. ఫంగస్ సమస్య తలెత్తుతుంది. రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. డస్ట్ ఎలర్జీ, ఊపిరితిత్తుల ఎలర్జీ వస్తుంది
ఏం చేయాలంటే...
- మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధ పడేవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
- శరీరాన్ని పూర్తిగా కప్పేలా దుస్తులు ధరించాలి.
- త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
- జలుబు, దగ్గు రెండు రోజులకు మించి ఉంటే వైద్యులను సంప్రదించాలి
- నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫ్రిజ్‌లో ఉన్న ఆహార పదార్ధాలు, నీళ్లు తాగకూడదు.
- వేజలీన్, పెట్రోలియం జెల్లీలు ఉపయోగించాలి.
- చలిగా ఉండే సమయంలో బయట తిరగరాదు.
- ఆస్తమా ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
- దగ్గు, జలుబు ఉన్న వారికి దూరంగా ఉండాలి.
- తెల్లవారు జామున, రాత్రి వేళల్లో స్నానం చేయకూడదు.
- కాలుష్య ప్రాంతాలలో తిరగకూడదు.
- పొగ తాగేవారికి దూరంగా ఉండాలి.
గుండెపోటు ముప్పు
చలికాలంలో ముఖ్యంగా నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. పొగమంచు, చల్లని గాలుల వల్ల ఉదయం పూట చలి తీవ్రత మరింత అధికం. ఈ పరిస్థితుల్లో వాకింగ్, జాకింగ్ చేసేవారు ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు చలికాలం ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే సూర్యకిరణాలు పడ్డాక వెళ్లడం శ్రేయస్కరం. అప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కార్డియాలజిస్టును సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
చిన్నారులకు జాగ్రత్తలివీ..
- చిన్నారులను చలిలో బయటకు తీసుకురాకూడదు
- చలిగాలిలో స్నానం చేయించకూడదు
- అత్యసవరంగా బయటకు తీసుకువెళ్లాలంటే తలకు, శరీరానికి నూలు వస్త్రాలు తొడగాలి.
- జలుబు, జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అల్ప ఉష్ణోగ్రతలు, పొగమంచుకు చిన్నారులను దూరంగా ఉంచాలి.
విటమిన్-సితో మేలు
మిగిలిన కాలాలతో పోలిస్తే చలికాలంలో కాస్త ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. శరీరం పొడిబారడంతో పాటు విసుగ్గా ఉంటుంది. ఈ కాలంలో సి విటమిన్ ఎక్కువగా లభించే పదార్ధాలు తినాలి. నిమ్మ, బత్తాయి, కమలా పండ్లను తీసుకోవాలి. వీటిని తినడం వల్ల జలుబు చేస్తుందని భ్రమ పడతారు. అటువంటి అపోహాలు పెంచుకోకుండా వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి.. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి.
ఏజెన్సీలో మంచు దుప్పటి
మెళియాపుట్టి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గత నాలుగు రోజులుగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చలి పెరగడంతో పాటు మంచు ఎక్కువగా కురుస్తోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో..ఏజెన్సీలో మంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో ప్రజలు దగ్గు, జలుబుతో అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళల్లో వాకింగ్‌కు వెళ్లేవారు మంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై మంచు కారణంగా వాహనాలు సమీపంలోకి వచ్చే వరకు గుర్తించడానికి వీలు కుదరడం లేదు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మంచు కారణంగా మండలంలోని ఓ పాఠశాల ఆటో ఢీకొని విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే.
ఇది వైరస్ కాలం
గత ఏడాది కంటే ఇప్పుడు చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కాలంలోనే వైరస్ ప్రభావం ఎక్కువ. రక్తం సరఫరా తగ్గి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకమే.
- పొన్నాడ గణేష్, సూపరెంటెండెంట్, సామాజిక ఆసుపత్రి, కోటబొమ్మాళి