విద్యావ్యవస్థ పూర్వ వైభవానికి కృషి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:59 PM
వైసీపీ హయాంలో భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కస్తూర్బా విద్యాలయం, కళాశాల ప్రాంగణంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన నూతన అదనపు కళాశాల భవనాన్ని ప్రారంభించారు.
- జనవరి ఒకటి నుంచి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
- వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కస్తూర్బా విద్యాలయం, కళాశాల ప్రాంగణంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన నూతన అదనపు కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘30 ఏళ్ల కిందటే అప్పటి సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం కల్పిస్తూ.. గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ‘నాడు-నేడు’ పేరుతో కొన్నిచోట్ల పాఠశాలలు బాగుచేసినా.. విలీనం పేరిట వాటిని మూసేశారు. చిన్నారులకు విద్యను దూరం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 రద్దు చేసి.. మళ్లీ పాత విధానాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయుల సహకారంతో పూర్వవైభవం తీసుకొస్తాం. జనవరి ఒకటి నుంచి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పునఃప్రారంభించనున్నాం. చాగంటి కోటేశ్వరరావు ద్వారా విద్యార్థులకు జ్ఞానవిద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే క్రీడల్లోనూ ప్రోత్సహిస్తోంది. పాఠశాల కమిటీలు బాధ్యత వహించి పాఠశాలల పురోభివృద్ధికి కృషి చేయాలి. స్థానిక కస్తూర్బా పాఠశాలకు మరో రెండు భవనాలు మంజూరు చేశాం. మరో డార్మెంటరీ భవనం మంజూరు చేయనున్నాం. ఇదేవిధంగా సంతబొమ్మాళి కేజీబీవీని తయారుచేస్తామ’ని తెలిపారు. ఇకపై శిలాఫలకాలపై నేతల ఫొటోలు ముద్రించరాదని, పేర్లు మాత్రమే ఉండాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో తిరుమల చైతన్య, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వరప్రసాద్, టీడీపీ నేతలు బోయిన రమేష్, తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, పూజారి శైలజ, కల్లి నాగయ్యరెడ్డి, కర్రి అప్పారావు, ఎస్.శ్రీనివాసరావు, ఈఈ డీవీఎన్ మూర్తి, జేఈ రామనాథం, ఏఈవోలు గోవిందరావు, ఎల్‌వీ ప్రతాప్, ప్రిన్సిపాల్ కె.ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.