TTD: శ్రీనివాసానంద సరస్వతి స్వామీ ఆరోపణలు సరికావు: టీటీడీ
ABN , Publish Date - Oct 28 , 2024 | 07:13 PM
టీటీడీ(TTD) అధికారులపై శ్రీనివాసానంద సరస్వతి స్వామి చేసిన ఆరోపణలు సరికావని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో సోమవారం పేర్కొంది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తమకు స్వామివారి దర్శన టిక్కెట్లను ఇవ్వకుండా అవమానించారని..
తిరుమల: టీటీడీ(TTD) అధికారులపై శ్రీనివాసానంద సరస్వతి స్వామి చేసిన ఆరోపణలు సరికావని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో సోమవారం పేర్కొంది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తమకు స్వామివారి దర్శన టిక్కెట్లను ఇవ్వకుండా అవమానించారని శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆరోపణలు గుప్పించారు. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. ‘నిజానికి స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనాలు, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారు. సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఇంతమందికి దర్శనం కల్పించడం సాధ్యం కాదని ఆ సంఖ్యను తగ్గించాలని ఆయన భావన. స్వామీజీ అడిగిన వారందరికీ శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదనే కోపంతో అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు’ అని టీటీడీ జారీ చేసిన ప్రకటనలో తెలిపింది.
శ్రీనివాసానంద సరస్వతి ఏమన్నారంటే..
తిరుపతిలోని అర్బన్ హార్ట్‌లో జాతీయ సాధు సమ్మేళనం సదస్సుకు హాజరైన 300 మంది స్వామీజీలకు.. టీటీడీ ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు దర్శనం కనిపిస్తానని మాట ఇచ్చారన్నారు. దర్శనానికి వెళ్లినప్పుడు ఇచ్చిన మాట తప్పి స్వామీజీలను అవమానించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే స్వామీజీలకు గౌరవం ఇచ్చి వీఐపీలకు మించి స్వామి వారి దర్శనం చేయించేవారని అన్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి లాంటి అవగాహన లేనివారి వల్ల ధర్మం గాడి తప్పుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని టీటీడీ ఏఈఓగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి వెంకయ్య చౌదరి వల్ల నిరాశే మిగులుతోందని ఆరోపించారు.