TDP : ప్రభుత్వ సొమ్ముతో కొన్నవన్నీ అప్పగించండి
ABN , Publish Date - Jun 19 , 2024 | 03:58 AM
ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పజెప్పాలని మాజీ సీఎం జగన్‌ను సాధారణ పరిపాలన శాఖ కోరింది.
మాజీ సీఎం జగన్‌కు జీఏడీ లేఖ
సమాధానం ఇవ్వని జగన్‌రెడ్డి కార్యాలయం
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పజెప్పాలని మాజీ సీఎం జగన్‌ను సాధారణ పరిపాలన శాఖ కోరింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రూ.కోట్లు విలువైన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొనుగోలు చేయించారు.
నిబంధనల ప్రకారం పదవి నుంచి దిగిపోయిన 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన వస్తువులు మొత్తం ఆయన తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నివాసంలో ఉంటే ఆ వస్తువులు మొత్తం అక్కడే ఉంచేసి ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ ఇప్పటి వరకూ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. పైగా తన పార్టీ నాయకులతో డబ్బులు చెల్లిస్తామని చెప్పిస్తున్నారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ రంగంలోకి దిగి వెంటనే ఆ ఫర్నిచర్, టీవీలు, ఎలక్ట్రికల్ వస్తువులు మొత్వం ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది.