Andhra Pradesh : టెక్కలిలో టీడీపీ ఏకపక్షమే !
ABN , Publish Date - May 09 , 2024 | 04:35 AM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో టీడీపీ ఘనవిజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
హ్యాట్రిక్ కోసం అచ్చెన్న తహతహ!
ఎలాగైనా గెలవాలని దువ్వాడ పోరాటం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో టీడీపీ ఘనవిజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తప్పుడు కేసులతో ఆయన్ను భయపెట్టాలని చూసినా.. అరెస్టు చేసి జైలుపాల్జేసినా ఆయనకు ప్రజాదరణ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా్‌సను మరోసారి బరిలో దించారు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన దువ్వాడ..
ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో పోరాడుతున్నారు. అచ్చెన్నాయుడు దివంగత నేత ఎర్రన్నాయుడి సోదరుడు. శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఈ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అచ్చెన్నాయుడు హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి 1996 నుంచి 2009 వరకు గెలుపొందుతూనే ఉన్నారు. పునర్విభజన తర్వాత ఏర్పాటైన టెక్కలి నియోజకవర్గం నుంచి 2009లో అచ్చెన్న పోటీచేసి ఓటమి చవిచూశారు.
ఆ తర్వాత 2014లో, 2019లో గెలుపొందారు. 2014-19లో మంత్రిగా పని చేశారు. అసెంబ్లీ లోపల, వెలుపల సీఎం జగన్‌పై విరుచుకుపడే టీడీపీ నేతల్లో అచ్చెన్న ప్రథమ స్థానంలో ఉంటారు. అందుకే జగన్ ఆయన్ను టార్గెట్ చేసి ఈఎ్‌సఐ కేసులో ఇరికించి అరెస్టు చేయించారు. 83 రోజులు జైల్లో ఉంచారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో తన సమీప బంధువును బెదిరించారన్న ఆరోపణలతో మరోసారి జైలుకు పంపారు. ఇవన్నీ ప్రజల్లో ఆయన పలుకుబడి ఇంకా పెరగడానికి దోహదపడ్డాయి.
దౌర్జన్యాల దువ్వాడ..
గత ఐదేళ్లలో దువ్వాడ శ్రీనివాస్ దౌర్జన్యాలకు చిరునామాగా మారారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అన్యాయంగా కేసులు పెట్టడం.. దాడులతో భయబ్రాంతులకు గురిచేయడం సాగించారు. 2006లో జడ్పీటీసీగా గెలిచి శ్రీకాకుళం జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్ (District ZP Vice Chairman) అయిన ఆయన, తర్వాత ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీ తరఫున 2009లో టెక్కలిలో పోటీచేసి మూడోస్థానానికి పరిమితమయ్యారు. తర్వాత వైసీపీ తరఫున 2014లో పోటీచేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై దురుసు వ్యాఖ్యలు చేస్తూ జగన్ దృష్టిలో పడ్డారు. 2021లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.వాస్తవానికి జగన్ తర్వాత అత్యధిక కేసులు ఉన్నది ఆయనపైనే. పక్క రాష్ట్రం ఒడిసాలో అధికారి సంతకం ఫోర్జరీ చేశారన్న అభియోగంతో భువనేశ్వర్‌లో 52 రోజులు జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక మరింత రెచ్చిపోయారు.
నియోజకవర్గానికి మూలపేట పోర్టు మంజూరుకావడంతో.. పోర్టుకు ఇసుక, కంకర, రాయి సరఫరాకు సంబంధించి కాంట్రాక్టులన్నీ తానే తీసుకుని లాభపడుతున్నారు. స్థానిక వైసీపీ నేతలెవరికీ అందులో భాగస్వామ్యం ఇవ్వలేదు.
దీంతో వీరు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వందలాది కుటుంబాలు టీడీపీలో చేరాయి. జగన్ ఎన్నికల బస్సు యాత్రను టెక్కలిలోనే ముగించారు. దువ్వాడను గెలిపించాలని ప్రజలను కోరారు. ఆ మర్నాడే దువ్వాడ బంధువులు సైతం పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇదంతా ఒక ఎత్తయితే.. దువ్వాడ శ్రీనుపై ఆయన భార్యే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ పెద్దలు వెళ్లి.. ఇంటి వ్యవహారం రచ్చకెక్కకుండా చక్కబెట్టారు.
- శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి
నియోజకవర్గ స్వరూపం
మండలాలు: నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి,
కోటబొమ్మాళి
మొత్తం ఓటర్లు 2,36,327
పురుషులు 1,17,816
మహిళలు 1,18,502
ట్రాన్స్‌జెండర్లు 9
సామాజికవర్గాల వారీగా
కాళింగులు: 76 వేలు, ఆర్యవైశ్య: 30 వేలు, మత్స్యకారులు: 26 వేలు, యాదవ-25 వేలు, రెడ్డిక-24 వేలు, ఎస్సీలు-24 వేలు, పోలినాటి వెలమ-16 వేలు, శ్రీశయన: 10 వేలు, ఎస్టీ-8 వేలు.
అచ్చెన్న బలాలు
దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజల్లో ఆయన, ఆయన కుటుంబంపై నమ్మకం.. మంత్రిగా చేసిన అభివృద్ధి. వైసీపీ కేడర్‌ను తన వైపు తిప్పుకోవడం.
బలహీనతలు..
సీనియర్ నేతలను విస్మరించడం.. సొంత వర్గానికే పెద్దపీట.
దువ్వాడ బలాలు
వైసీపీ నాయకత్వం అండ.. ఆర్థికంగా బలంగా ఉండడం
బలహీనతలు..
దుందుడుకు స్వభావం.. నోరెత్తితే బండబూతులు తిట్టడం.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. భార్యతోనూ పొసగకపోవడం.. పార్టీ నాయకుల్లో అసమ్మతి.