Share News

AP News: ఎంపీడీఓ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ

ABN , Publish Date - Jul 18 , 2024 | 09:50 AM

నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. అదృశ్యమయ్యి నాలుగురోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. విజయవాడ మధురానగర్ వద్ద కాల్వలోకి దూకి ఉంటాడనే అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.

AP News: ఎంపీడీఓ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ

ఏలూరు: నరసాపురం ఎంపీడీఓ వెంకట రమణా రావు అదృశ్యం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. అదృశ్యమయ్యి నాలుగురోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. విజయవాడ మధురానగర్ వద్ద కాల్వలోకి దూకి ఉంటాడనే అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. వెంకట రమణారావుకు తరచుగా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 15న రాత్రి 10 గంటలకు వెంకట రమణారావు అదృశ్యమయ్యారు. ఆయన అదృశ్యంపై కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఇదే పుట్టినరోజు.. చనిపోయే రోజు కూడా..

ఈ నెల 15న రాత్రి మచిలీపట్నం రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఎంపీడీవో వెంకటరమణా రావు పెట్టారు. ఆ తరువాత టికెట్ తీసుకుని రైలు ఎక్కేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు సంపాదించారు. ఇక ఆయన విజయవాడలో రైలు దిగారు. ఆయన ఫోన్ సిగ్నల్స్ మాత్రం ముత్యాలంపాడు వద్ద ఆగిపోయాయి. ఈ ముత్యాలంపాడుకు సమీపంలోనే ఏలూరు కాలువ ఉండడంతో దానిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16వ తేదీ వెంకటరమణారావు పుట్టినరోజు కావడంతో అదే రోజున ‘ఈ రోజు నా పుట్టిన రోజు. నేను చనిపోయే రోజు కూడా’ అదే అంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టారు.


బకాయిలు రికవరీ చేయకపోవడంతో..

తనను తాను మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని.. కాబట్టి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కుటుంబసభ్యులకు ఎంపీడీవో వాట్సాప్‍‌లో నోట్ పంపారు. బోటింగ్ కాంట్రాక్టర్‍‌ను రూ.55లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతోనే వారు డబ్బులు చెల్లించలేదని, గత మూడున్నర నెలల నుంచి నిందితులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారం అంటూ బాధను వెల్లగక్కారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చూసి న్యాయం చేయాలంటూ ఆయన లేఖలో కోరారు.

Updated Date - Jul 18 , 2024 | 09:50 AM