Kadambari Jethwani: గత ప్రభుత్వ పెద్దలు, పోలీసులు నన్నొక ఆట బొమ్మలా ఆడుకున్నారు
ABN , Publish Date - Aug 30 , 2024 | 07:35 AM
అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీనటి కాదంబరి జెత్వాని పేర్కొంది. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది.
అమరావతి: అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీనటి కాదంబరి జెత్వాని పేర్కొంది. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది. తన దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించింది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళుతున్నానని తెలిపింది. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని సినీ నటి జెత్వాని తెలిపింది.
తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానని జెత్వాని పేర్కొంది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. అప్పట్లో తనను చిత్రహింసలకు గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తానని వెల్లడించింది. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారని.. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాననని తెలిపింది. తనపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని వెల్లడించింది. గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు తననొక ఆట బొమ్మలా ఆడుకున్నారని జెత్వాని తెలిపింది. చట్ట వ్యతిరేకంగా కొందరు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు తననూ.. తన కుటుంబాన్ని చిత్ర హింసలకు గురి చేశారని హీరోయిన్ జిత్వాని వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
తనలా మరెవరికి జరగకూడదని కాదంబరి జెత్వాని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాలని కోరింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని.. ఏపీ పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారని తెలిపింది. కాగా.. తనను బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి తన పొలాన్ని రాయించుకుందని కాదంబరి జెత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌రావు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు ఆధారంగా ఓ డాక్యుమెంట్‌ను సైతం సృష్టించారు. అయితే 2018లో రాసుకున్నట్లుగా ఉన్న డాక్యుమెంట్‌పై.. 2020లో ముంబైలోని జుహూలో కాదంబరి కొన్న ఫ్లాట్ చిరునామా చూపించారు. అంతేకాదు... ఆ డాక్యుమెంట్ పేపర్‌ను స్టాంప్ వెండర్ నుంచి 2023లో కొన్నట్లు దానిపై స్పష్టంగా ఉంది. ఏపీ పోలీసులు తనపై పెట్టింది తప్పుడు కేసు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కాదంబరి ప్రశ్నిస్తోంది.