Share News

Kadambari Jetwani: ఉచ్చు బిగుస్తోంది!

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:42 AM

Kadambari Jetwani: జగన్‌ హయాంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ గూండాలకు, వారికి సహకరించిన ‘వైపీఎస్‌’ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతల తప్పులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు పోలీసులను నడిపిస్తున్నారు. ఫలితంగా ..

Kadambari Jetwani: ఉచ్చు బిగుస్తోంది!
Kadambari Jetwani

  • వైసీపీ నేతలకు దడదడ..

  • ‘వైపీఎస్‌’ అధికారుల్లోనూ వణుకు

  • పలు కేసుల్లో పక్కాగా ముందుకు

  • చంద్రబాబు ఆదేశాలతో దర్యాప్తు వేగం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ గూండాలకు, వారికి సహకరించిన ‘వైపీఎస్‌’ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతల తప్పులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు పోలీసులను నడిపిస్తున్నారు. ఫలితంగా వైసీపీ జమానాలో రెచ్చిపోయినవారి వెన్నులో వణుకు పుడుతోంది. వారికి వంత పాడిన ఖాకీలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ వ్యవహారంలో తనను వేధించి, హింసించిన ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌, వ్యూహరచన చేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, అమలు చేసిన అడిషనల్‌ ఎస్పీ విజయ్‌పాల్‌పై గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హత్యాయత్నం సెక్షన్లు పెట్టారు.


అయితే నిందితులు సీనియర్‌ ఐపీఎ్‌సలు కావడం, అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన విజయ్‌పాల్‌ దర్యాప్తు అధికారికి సహకరించక పోవడంతో కేసు నీరుగారి పోతోందన్న భావన వ్యక్తమైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి కేసు దర్యాప్తు బాధ్యతలను ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్‌కు అప్పగించింది. దీంతో విజయ్‌పాల్‌ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. పాల్‌ నోరు విప్పితే ఎవరెవరు కుట్ర చేశారు? ఎవరు అమలు చేశారు? తదితర విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈ కేసులో నిందితుడైన మాజీ సీఎం జగన్‌ పాత్రా వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు.


జెత్వానీ కేసు సీఐడీకి..

ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో విజయవాడ ఏసీపీ దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇతర నిందితుల్లో డీజీపీ ర్యాంకు అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ఐజీ ర్యాంకు అధికారి కాంతి రాణా తాతా, డీఐజీ ర్యాంకు అధికారి విశాల్‌ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, మరో న్యాయవాది ఉన్నారు. వీరందరినీ విచారించి కేసు నిలబెట్టాలంటే సీఐడీకి అప్పగించడమే సమంజసమని సర్కారు భావించింది. అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి చీఫ్‌గా ఉన్న సీఐడీలో ఐజీ వరకు విచారించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


బాబు ఇల్లు, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుల్లో..

వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జోగి రమేశ్‌ నేరుగా ప్రతిపక్ష నేత ఇంటిపైకి చెప్పి మరీ తన అనుచరులతో వెళ్లి దాడికి దిగారు. అడ్డుకోబోయిన టీడీపీ శ్రేణులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు అదే వైసీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై సాధారణ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అప్పటి సీఎం జగన్‌ ఈ దాడులను ఖండించక పోగా ‘‘నన్ను తిట్టారు.. మా వాళ్లు కొట్టారు’’ అని సమర్థించారు. తర్వాత కాలంలో జోగికి మంత్రి పదవి కట్టబెట్టారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే పెండింగ్‌ కేసులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తాడేపల్లి పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చెయ్యగానే ప్రధాన కుట్రదారు జోగి రమేశ్‌ ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. దీనిలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని ప్రభుత్వం భావించింది. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులోనూ పోలీసుల పనితీరు ప్రభుత్వ పెద్దలకు సంతృప్తిగా అనిపించలేదు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తమ ఆఫీసుపై పట్టపగలు బీభత్సం సృష్టించిన వారిని అరెస్టు చేయడంలో మంగళగిరి పోలీసులు సరిగా వ్యవహరించలేదని భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌ వంటి వారు ముందస్తు బెయిల్‌ తెచ్చుకోగలిగారనే నిర్ధారణకు వచ్చింది.


సీఎం అసంతృప్తితో!

దాడులు, కుట్ర కేసులపై ఇటీవల సమీక్షించిన సీఎం చంద్రబాబు ‘‘వాళ్లలా(వైసీపీ) నేను అరచకాలు, దౌర్జన్యాలకు మద్దతివ్వను. కానీ, తప్పుచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతే ఎలా?’’ అని పోలీసు ఉన్నతాధికారుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో లోపాన్ని గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు ఇల్లు, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులను సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో ఆ రెండు కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇక, మదనపల్లె ఫైల్స్‌ దహనం కేసును కూడా సీరియ్‌సగా తీసుకుని బాధ్యుల్ని చట్టపరంగా శిక్షించాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలో అత్యాచార ఘటనలు అరికట్టేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.

Updated Date - Oct 22 , 2024 | 09:02 AM