Share News

JC Asmith Reddy: కొందరు పోలీసుల తీరులో మార్పు రాలేదు..

ABN , Publish Date - Aug 28 , 2024 | 01:55 PM

తాడిపత్రిలో అక్రమ ఇసుక వివాదం ఇంకా జరుగుతూనే ఉంది. ఇసుక అక్రమ రవాణాను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీం అడ్డుకోవడం జరిగింది. అస్మిత్ రెడ్డి టీంపై టిప్పర్ యజమానులు దాడి చేశారు.

JC Asmith Reddy: కొందరు పోలీసుల తీరులో మార్పు రాలేదు..
JC Asmith Reddy

అనంతపురం: తాడిపత్రిలో అక్రమ ఇసుక వివాదం ఇంకా జరుగుతూనే ఉంది. ఇసుక అక్రమ రవాణాను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీం అడ్డుకోవడం జరిగింది. అస్మిత్ రెడ్డి టీంపై టిప్పర్ యజమానులు దాడి చేశారు. టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే చెప్పినా కూడా టిప్పర్ యజమానులపై లక్ష్మీకాంత్ రెడ్డి కేసు నమోదు చేయలేదు. దీంతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అస్మిత్ రెడ్డి బైఠాయించారు. వర్షంలోనూ ఆయన నిరసన తెలిపారు. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతలకు సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నాడంటూ మండిపడ్డారు. సీఐకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. చివరకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


అనంపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కలిశారు. తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఎస్పీతో చర్చించారు. తన పట్ల సీఐ మాట్లాడిన తీరును ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అస్మిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. ఇసుక మాఫియాని అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరామన్నారు. ఇంకా పోలీసుల తీరులో మార్పు రాలేదన్నారు. ఒకరిద్దరు పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందన్నారు. తాడపత్రి ఇసుక మాఫియా గురించి ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయమని అడిగామన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నామన్నారు.


ఎవరూ స్పందించక పోవడం వల్ల స్వయంగా తానే రంగంలోకి దిగానని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తెలిపారు. ఇసుక దందాను ఇకపై జరగనివ్వబోనని తేల్చి చెప్పారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తనను దాదాపు అయిదు గంటల సేపు వర్షంలో నిలబెట్టారన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోలేనప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి సీఐగా ఎందుకని ప్రశ్నించారు. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు. అయితే అస్మిత్ రెడ్డి ఎస్పీ జగదీష్‌ని కలిసి వచ్చిన అనంతరం తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సైతం ఆయనను కలిశారు. ఆ సమయంలో సీఐపై ఎస్పీ ఫైర్ అయినట్టు సమాచారం.

Updated Date - Aug 28 , 2024 | 02:12 PM