Amaravati : బుడమేరుతో ‘బండి’ కష్టాలు
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:48 AM
‘అన్నా... నా బండి రిపేర్ చేయ్యాలి. అర్జెంటు అన్నా. ఇది లేకపోతే ఉద్యోగమే లేదు.’ ‘ఇప్పుడు కాదన్నా. కనీసం 10 రోజులు పడుతుంది. చాలా బళ్లు ఉన్నాయి.’ ఇది ఇప్పుడు బెజవాడ నగరంలో మెకానిక్‌లకు, బైక్ యజమానులకు మధ్య జరుగుతున్న సంభాషణ.
షెడ్డులకు క్యూ కడుతున్న వాహనాలు.. బీమా వర్తించదంటున్న కంపెనీలు
అర్జెంట్ అంటే కుదరదంటున్న మెకానిక్‌లు
బైకైతే వేలల్లో... కారైతే లక్షల్లో ఖర్చు
తలలు పట్టుకుంటున్న వాహన యజమానులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘అన్నా... నా బండి రిపేర్ చేయ్యాలి. అర్జెంటు అన్నా. ఇది లేకపోతే ఉద్యోగమే లేదు.’ ‘ఇప్పుడు కాదన్నా. కనీసం 10 రోజులు పడుతుంది. చాలా బళ్లు ఉన్నాయి.’ ఇది ఇప్పుడు బెజవాడ నగరంలో మెకానిక్‌లకు, బైక్ యజమానులకు మధ్య జరుగుతున్న సంభాషణ. ముంచెత్తిన వరదలో వేలాది బైకులు రెండు మూడు రోజుల పాటు నానాయి. దీంతో ద్విచక్ర వాహనాలు స్టార్ట్ కావట్లేదు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి నగరంలోని మెకానిక్‌ల వద్దకు వందలాది మంది తమ ద్విచక్ర వాహనాలు తీసుకొస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని అజిత్‌సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేట, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాల నుంచి బైకులు తీసుకుని నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డు, ఏలూరు రోడ్డు, మాచవరం, గుణదల తదితర ప్రాంతాల్లోని మెకానిక్‌ల వద్దకు వస్తున్నారు. ఒక్కసారిగా వందలాది బైకులు మరమ్మతుకు రావడంతో మెకానిక్‌లు తమవల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. నగరంలోని మెకానిక్ షాపులన్నీ పార్కింగ్ ప్రదేశాలను తలపిస్తున్నాయి. ఇక్కడకు వస్తున్న వాహన యజమానుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన కష్టం.
కార్లదీ ఇదే పరిస్థితి
వరద బీభత్సానికి కార్లూ భారీగా పాడయ్యాయి. ఐదారు అడుగుల మేర బుడమేరు వరద నీరు రావడతో మొత్తం కార్లు మునిగిపోయి కదలకుండా ఆగిపోయాయి. బుధవారం వరద నీరు తగ్గడంతో వాటిని స్టార్ట్ చేసేందుకు యజమానులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో నగరంలోని కార్ల షోరూమ్‌ల వద్దకు యజమానులు క్యూ కడుతున్నారు. ‘ఇప్పటికిప్పుడు అంటే కుదరదు. మరో రెండు రోజులు పడుతుంది. సర్వీసింగ్ సెంటర్లు ఖాళీ లేవు. గురు, శుక్రవారాలకు సరిపడా కార్లు ఇప్పటికే ఉన్నాయి. ఆ తర్వాత వినాయకచవితి, ఆదివారం సెలవు. సోమవారం అయితే తీసుకొచ్చి చేస్తాం’ అంటూ సర్వీసింగ్ సెంటర్ల యజమానులు చెపుతున్నారు. ప్రకృతి విపత్తు కావడంతో ఇన్సూరెన్స్ వర్తించబోదని, నీటిలో రెండు, మూడు రోజుల తడిచిన కారు షోరూమ్‌కు వస్తే ఇంజిన్, బ్రేక్ డ్రమ్, వైరింగ్ సిస్టమ్ మొదలు కొని సీట్లు, ఆడియో సిస్టమ్ వరకూ అన్నీ పరిశీలించి రిపేరీ చేయడం లేదా మార్చడం తప్పదంటున్నారు. కనీసం రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బుడమేరు వరదకు విజయవాడలో కనీసం మూడు వేలకు పైగా కార్లు నీటిలో చిక్కుకు పోయాయని సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి ముత్యాల అనిల్ కుమార్ చెప్పారు. భరించలేక యజ మానులు విక్రయిం చేందుకు వస్తున్నారని అన్నారు.
మార్కెటింగ్ జాబ్... బైకేమో రిపేర్
‘నాది మార్కెటింగ్ ఉద్యోగం. రోజూ తిరగాల్సిందే. బైకు ఇంజిన్ పాడైంది. వరదల్లో మునిగితే బీమా వర్తించదట. రిపేరు చేయించాలంటే రూ.18 వేలు అవుతుంది అంటున్నారు. ఎలా చేయాలో దిక్కుతోచడం లేదు. పోనీ అప్పు చేసైనా డబ్బులు ఇద్దామంటే మెకానిక్‌లు వారం రోజులైనా ఇవ్వలేం అంటున్నారు. దిక్కు తోచడం లేదు.’
- శివ, సింగ్‌నగర్
ఒక్క రోజే 45 బళ్లు వచ్చాయి
‘30 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నా. ఎప్పుడూ 10 బండ్లకు మించి రాలేదు. ఈ రోజు 45 బైకులొచ్చాయి. రాత్రింబవళ్లు చేసినా నెల రోజుల పని ఉంది. ఇంజిన్‌లోకి నీరు చేరింది. వైరింగ్ సిస్టమ్ పాడైంది. ఇవన్నీ చేయాలంటే బాగా ఖర్చవుతుంది. బైకు పాతదైతే చేయించుకోక పోవడమే మంచిదని వచ్చిన వారికి చెబుతున్నా.’
- గోపి, బైక్ మెకానిక్, మాచవరం
కొత్త బైకు... బీమా రాదంటున్నారు
‘నాది కొత్త బైకు. 14 నెలలైంది కొనుగోలు చేసి. ఇన్సూరెన్స్ ఉన్నా ఇలాంటి వాటికి రాదంటున్నారు. షోరూమ్‌లో చేయించాలంటే రూ.26 వేలు అవుతుందని చెప్పారు. మెకానిక్ అయితే తగ్గుతుందని బీఆర్‌టీఎస్ రోడ్డుకు వచ్చా. ఇక్కడేమో ఇప్పుడే చేయలేం అంటున్నారు. బండి లేకుంటే ఉద్యోగానికి వెళ్లడం కుదరదు. ఇప్పటికే నాలుగు రోజులు పోయాయి. ఇంకా డ్యూటీ పోతే అటు జీతం తగ్గి, ఇటు బండి ఖర్చు మీదపడి కోలుకోవడం కష్టంగా ఉంటుంది.’
- మూర్తి, రాజరాజేశ్వరిపేట