AP News: శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్.. చాపకింద నీరులా పక్క రాష్ట్రాలకు
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:35 PM
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి డివిజన్ లో గంజాయి బ్యాచ్ బరితెగించారు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. విచారణలో విస్తుపోయే..
తిరుపతి: శ్రీకాళహస్తిలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ ను తిరుపతి పోలీసులు ఛేదించారు. ఈ డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు యువకులు ఓ ముఠాగా ఏర్పడి గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ లో 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు.
ఎవ్వరినీ వదలం..
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు దీనిపై మాట్లాడుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘శ్రీకాళహస్తి డివిజన్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయిస్తున్నారు, పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి మూడు రాష్ట్రాలకు ఈ ముఠా గంజాయిని సరఫరా చేసినట్లు ఆధారాలు దొరికాయి. మొత్తం 17మందిని అరెస్ట్ చేశాం..32కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 17మందిలోని ముఠా సభ్యులు శ్రీకాళహస్తి సబ్ డివిజన్‌తో పాటు వెంకటగిరి, పాడేరు జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. గంజాయి అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంజాయి విక్రయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం’’ అని తెలిపారు.