AP News: మలికా గర్గ్ మాకొద్దు.. 20 రోజుల్లోనే బదిలీ అయిన సిన్సియర్ ఆఫీసర్ !
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:37 AM
సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మలికా గర్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్టు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి పంపించేసిన జగన్ ప్రభుత్వం.. ఆమెను సీఐడీకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్‌ను నియమించింది.
మహిళా ఐపీఎస్‌పై వైసీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు.. ఓకే చేసిన సీఎం
తిరుపతి ఎస్పీగా నియమించిన 20 రోజుల్లోనే సీఐడీకి బదిలీ
ఎన్నికల్లో నేతల అక్రమాలు సాగబోవనే కారణంతో వేటు!
గర్గ్ బదిలీపై ఐపీఎస్‌లలో విస్మయం.. తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్
అమరావతి/తిరుపతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మలికా గర్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్టు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి పంపించేసిన జగన్ ప్రభుత్వం.. ఆమెను సీఐడీకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్‌ను నియమించింది. కాగా, ప్రభుత్వ తీరుపై పోలీసు ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా ఎస్పీగా పని చేయాలన్నా.. శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ కావాలన్నా.. ‘వైసీపీ చట్టం’ అమలు చేయాల్సిందే. ప్రతిపక్షాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పట్టుకొచ్చి చితక బాదాల్సిందే. అదే అధికార పార్టీ వారైతే ఏం చేసినా చూసీ చూడనట్లు ఉండాల్సిందే. అయితే అందరూ తాము అనుకున్నట్లు ఉండరని అక్కడక్కడ వైసీపీ నేతలకు అర్థం అయ్యేలా పనిచేసిన అధికారులు లూప్‌లైన్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పనిచేసిన మల్లికా గార్గ్ సమర్థవంతమైన, నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ జిల్లాకు చెందిన వైసీపీ నేతల అక్రమాలకు ఆమె అడ్డుగా ఉండటంతో కొంత కాలంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ పెద్దల్ని కలిసి జిల్లా ఎస్పీని మార్చాలని పట్టుబట్టారు. ఎట్టకేలకు జనవరి చివర్లో జరిగిన బదిలీల్లో ఆమె తిరుపతికి బదిలీ అయ్యారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో జరిగినన్ని అక్రమాలు దేశంలో దాదాపు ఎక్కడా జరగలేదని సీఈసీ విచారణలో వెల్లడైంది. వైసీపీ అక్రమాలకు వంత పాడిన పోలీసు అధికారులపై ఆమె చర్య తీసుకున్నారు. ఇతర అధికారులను పిలిచి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ.. నిష్పక్షపాతంగా పనిచేసే వారు మాత్రమే తన పరిధిలో ఉండాలని, అలా చేయలేని వారు వెళ్లిపోవచ్చని పరిచయ కార్యక్రమంలోనే హెచ్చరించారు.
ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులపై నిఘా పెట్టి అధికార పార్టీతో అంట కాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారిని కట్టడి చేశారు. అయితే, తిరుమల శ్రీవారి సేవలో ఉండే ఇద్దరు వైసీపీ కీలక ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ‘మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి.. ఇప్పటికే తిరుపతి భ్రష్టు పట్టింది. సరి చేయనివ్వండి’ అని ఆమె బదులివ్వడంతో దిక్కుతోచక తాడేపల్లి ప్యాలె్‌సకు విన్నవించుకున్నారు. మలికా గర్గ్ ఎస్పీగా ఉంటే తిరుపతిలో గెలిచే పరిస్థితి లేదంటూ లబో దిబో మన్నారు. అంతేకాదు, గతంలో పలువురు జిల్లా అధికారుల మాదిరిగా ఆమె అధికార పార్టీ ముఖ్యుల ఇళ్లకు వెళ్లి సన్మానాలు చేయకపోవడాన్ని వారు జీర్ణించు కోలేకపోయారని సమాచారం. ఇక, తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు వచ్చే ఎన్నికల్లో పునరావృతం కారాదని ఆమె యంత్రాంగానికి పటిష్టమైన ఆదేశాలిచ్చారు. సీఎంకు సన్నిహితుడిగా పేరుపడ్డ ఓ పోలీసు అధికారికి బందోబస్తు డ్యూటీలు వేశారు. గతంలో ఎవరూ ఇలా చేయకపోవడం గమనార్హం. దీంతో గర్గ్ ఎస్పీగా కొనసాగితే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల నాటి ఎపిక్ కార్డుల కేసుల దర్యాప్తులో కూడా ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ నేతలు, అందులో పాలుపంచుకున్న పోలీసు అధికారులు ఆందోళనకు గురైనట్టు ఆయా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికీ మించి వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంటనే ఆమెను బదిలీ చేయాలన్న నేతల అభ్యర్థనలతో సీఐడీకి బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పలువురు ఐపీఎ్‌సలను కూడా బదిలీ చేసింది.