Share News

Tomato Rate: దిగొస్తున్న టమాటా ధరలు.. కిలో కేవలం..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:32 PM

ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. కర్నూల్ మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.20 పలుకుతోంది. అయితే ఈ ధరలపట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు.

Tomato Rate: దిగొస్తున్న టమాటా ధరలు.. కిలో కేవలం..!

కర్నూలు: ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. కర్నూల్ మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.20 పలుకుతోంది. అయితే ఈ ధరలపట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. తగ్గిన ధరలతో కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో కిలో టమాటా రూ.20 నుంచి రూ.25 పలుకుతుండగా, రైతులకు కిలో రూ.4 నుంచి రూ.5 మాత్రమే వస్తోంది. పత్తికొండ మార్కెట్‌లో12 కిలోల టమోటాలు కేవలం రూ. 50కే విక్రయిస్తున్నారు. అంటే ఆ లెక్కన కిలో టమాట రూ. 4 పడుతుందనమాట.

పత్తికొండ మార్కెట్‌కు 2 వేల 500 నుంచి 3వేల బాక్సుల టమోటాలు వస్తున్నాయి. ఉదాహరణకు రెండు 25 కేజీల బాక్సులు రూ.250 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. అంటే గిట్టుబాటు కూడా రావట్లేదనమాట. ఈ సీజన్‌లో టమోటా సాగు చేసే ప్రాంతం బాగా తగ్గిపోయింది. కర్నూలు జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం 2 వేల 600 హెక్టార్ల నుంచి 1,450 హెక్టార్లకు పడిపోయింది. నంద్యాల జిల్లాలోనూ గతేడాది 2 వేల 310 హెక్టార్లలో సాగు చేయగా, ఈ ఏడాది 2 వేల 050 హెక్టార్లకు తగ్గింది.


సాగు ఖర్చుల్లో మార్పులు..

టమాటా సాగు ఖర్చులు గణనీయంగా మారుతూ ఉంటాయి. సంప్రదాయ పద్ధతుల్లో ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు, ట్రేల్లిస్ సిస్టమ్‌ను ఉపయోగించి ఎకరానికి రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. కర్నూల్‌లో ప్రతి సంవత్సరం 4 వేల నుంచి 6 వేల హెక్టార్లు (10 వేలు - 15 వేల ఎకరాలు) సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 23 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అవుతాయి. కర్నూల్ జిల్లాలో పత్తికొండ, ఆస్పరి, బిల్లేకల్, దేవనకొండ, విరూపాపురం, పీపుల్లి, ధోనే ఏరియాల్లో ప్రధాన హోల్‌సేల్ మార్కెట్‌లు ఉన్నాయి.

సాధారణంగా పత్తికొండ మార్కెట్ యార్డ్‌లో టమాటలకు సంబంధించి10 శాతం కమీషన్ వసూలు చేస్తుంటారు. అయితే ఈ సారి కమీషన్ వసూలు చేయట్లేదని మార్కెట్ అధికారులు తెలిపారు. అదనంగా వాహన సామర్థ్యం ఆధారంగా రూ.600 నుంచి రూ.800 వరకు సెస్ వసూలు చేస్తున్నారు. టమాటా ధరల పెరుగుదల తరువాత ఆగస్టు మొదటి వారంలో మార్కెట్‌కు ఇబ్బడిముబ్బడిగా టమాట రాక మొదలైంది. దిగుబడి పెరగడంతో రూ.80కి తగ్గని టమాటా ధరలు ప్రస్తుతం పాతాళానికి పడిపోయాయి. కిలో రూ.10 నుంచి రూ.20 మధ్యలోనే దొరుకుతున్నాయి. గతంలో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి టమాటా బాక్స్‌లను వ్యాపారులు వేలం వేసేవారు.


తద్వారా రైతులకు గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించి, ఇతర మార్కెట్‌లకు నిల్వలను దారి మళ్లిస్తున్నారని, అక్కడ వాటిని కిలో రూ.10 నుంచి రూ.15కు విక్రయిస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. పత్తికొండలో రూ.12.05 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు గత అక్టోబరులో పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. అయినప్పటికీ దీని పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మూడెకరాల్లో రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టి టమాటా సాగు చేసిన రైతు కె.రాగప్ప ప్రస్తుత మార్కెట్ ధరల కారణంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాడు. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 06:00 PM