Thakur Pharma : ‘ఠాగూర్’ ఫార్మా బరితెగింపు!
ABN , Publish Date - Dec 04 , 2024 | 03:46 AM
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీ హద్దులు మీరింది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి హెచ్‌ఐవీ, హెపటైటి్‌స-బి మందులు తయారుచేస్తోంది.
హెచ్‌ఐవీ, హెపటైటి్‌స-బి మందుల తయారీ
అనుమతులు లేకుండా ‘లామివుడిన్’ ఉత్పత్తి
వారం క్రితం ‘ఫాస్జీన్’ విషవాయువు లీకై ప్రమాదం
ఇద్దరు కార్మికులు మృతి.. 27 మందికి తీవ్ర అస్వస్థత
ఉత్పత్తి నిలిపివేతకు ఫ్యాక్టరీస్ విభాగం ఆదేశం
యూనిట్ మూసివేతకు చర్యలపై పీసీబీ సిఫారసు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీ హద్దులు మీరింది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి హెచ్‌ఐవీ, హెపటైటి్‌స-బి మందులు తయారుచేస్తోంది. ఈ వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి ఉపయోగించే ‘లామివుడిన్’ అనే యాంటీ రిట్రోవైరల్ మందును ఉత్పత్తి చేస్తోంది. దీనికిసంబంధించిన సమాచారం ప్రభుత్వ శాఖలకు ఇవ్వలేదు. ఈ మందు తయారు చేస్తుండగా నవంబరు 26న రియాక్టర్ నుంచి విషవాయువులు వెలువడ్డాయి. ఇద్దరు కార్మికులు మరణించగా, మరో 27 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ప్రమాదంపై కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ అధికారులను యాజమాన్యం తప్పుదోవ పట్టించింది. మ్యాన్‌హోల్‌లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోరో ఫాం వేస్తుండగా పొగలు వచ్చాయని, దానివల్లే కార్మికులు చనిపోయారని చెప్పింది. అయితే ‘ప్రజల కోసం శాస్త్రవేత్తలు’ బృందం ప్రతినిధు లు బాబూరావు, అనురాధలు.. యాజమాన్యం వాదనను ఖండించారు.
హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోరోఫాం కలవవని, వారు ఏదో పొడి వంటిది చల్లి ఉంటారని, దానివల్ల ‘ఫాస్జీన్’ విష వాయువు వెలువడి కార్మికులు చనిపోయి ఉంటారని ఆరోపించారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో అధికారులు ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. రియాక్టర్ జీఎల్‌ఆర్ 325లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోర్‌ఫాం వేస్తుండగా ‘ఫీడ్ కంట్రోల్ సిస్టమ్’ విఫలమైందని, కింద పడిన యాసిడ్‌ను తుడవడానికి కార్మికులు సోడా పౌడర్ చల్లడంతో ఆ రియాక్షన్‌కు ‘ఫాస్జీన్’ విషవాయువు వెలువడి కార్మికులు చనిపోయారని విచారణ లో తేల్చారు. తక్షణమే లామివుడిన్ ఉత్పత్తిని ఆపేయాలని ఫ్యాక్టరీస్ విభాగం ఆదేశాలు ఇచ్చింది. ఆ యూనిట్ మూసివేతకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
అధికారులు గుర్తించిన లోపాలు
ప్రమాదాల విశ్లేషణ, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు లేవు.
లామివుడిన్ తయారీపై అధ్యయనం చేయలేదు.
ప్రాంగణంలో సేఫ్టీ రిలీఫ్ వాల్వ్‌లు లేవు.
రియాక్టర్లకు స్క్రబ్బింగ్ సిస్టమ్ లేదు.
రప్చర్ డిస్క్‌ల ఆనవాళ్లు లేవు.
వాయువులు లీకైనప్పుడు డిటెక్టర్లు, అలారం సిస్టమ్ లేదు.
అక్టోబరులోనే సేఫ్టీ ఆడిట్... లోపాలు గుర్తింపు
ఠాగూర్ కంపెనీలో ప్రమాదం జరగడానికి నెల రోజుల ముందే ఆ కంపెనీలో ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. లోపాలను గుర్తించి, సరిచేయాలని కోరారు. ఆ ప్రక్రియ పూర్తికాక ముందే ప్రమాదం చోటుచేసుకుంది. లామివుడిన్ తయారీకి సంబంధించిన సమాచారం పీసీబీకి ఇవ్వలేదు. ఈ విధంగా అనుమతులు లేకుండా ముందులు తయారుచేస్తున్న కంపెనీలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్ని ఉన్నాయో తెలీదు. ప్రమాదం జరిగిన తరువాత ఠాగూర్ యూనిట్‌ని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. కార్మికులకు పరిహారం ఇప్పించే ప్రయత్నం చేశారే తప్ప అనుమతుల విషయాన్ని బయటపెట్టలేదు. ఇలాంటి సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలని పూర్వ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు.