Share News

Road Accident : నిద్రలోనే అగ్నికి ఆహుతి

ABN , Publish Date - May 16 , 2024 | 04:50 AM

రెండు గంటల ముందు వరకూ అమ్మమ్మ, తాతయ్యకు కబుర్లు చెబుతూ ఆడుకుంది ఆ పాప..! ఆ బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోతూ మెల్లిగా మనవరాలితో కలిసి నిద్రలోకి జారుకున్నారు ఆ పెద్దవాళ్లు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

Road Accident : నిద్రలోనే అగ్నికి ఆహుతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనం

మరో 29 మందికి గాయాలు

ఓటేయడానికి వచ్చి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం

సంఘటనా స్థలంలో భీతావహ దృశ్యాలు

బాపట్ల (ఆంధ్రజ్యోతి), చిలకలూరిపేట, చినగంజాం, గుంటూరు, మే 15: రెండు గంటల ముందు వరకూ అమ్మమ్మ, తాతయ్యకు కబుర్లు చెబుతూ ఆడుకుంది ఆ పాప..! ఆ బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోతూ మెల్లిగా మనవరాలితో కలిసి నిద్రలోకి జారుకున్నారు ఆ పెద్దవాళ్లు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఓటేయడానికి వచ్చిన ఓ యువకుడు అప్పుడే అమ్మానాన్నతో మాట్లాడి రెప్పవాల్చారు.... పిల్లల చదువుల కోసం హైదరాబాద్‌లో ఉంటూ ఓటేయడానికి స్వగ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణమైన వ్యక్తి మరొకరు.... ఇలా ఆ బస్సులో దాదాపుగా అందరూ ఓటేయడానికి సొంతూరికొచ్చి హైదరాబాద్‌కు తిరుగుపయనమైన వారే. మంగళవారం రాత్రి 44 మందితో బాపట్ల జిల్లా చినగంజాం నుంచి చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ బయల్దేరిన ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. పల్నాడు జిల్లాలోని అన్నంబట్ల వారిపాలెం-పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు రాగానే కంకర లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి టిప్పర్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ పగలడంతో రెప్పపాటులోనే మంటలు వ్యాపించాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో అర్థంకాక పెద్దఎత్తున హాహాకారాలు పెట్టారు. డోర్‌ దగ్గరే కూర్చున్న ఓ యువకుడు అందరినీ అప్రమత్తం చేయడంతో కొంతమంది ముందుద్వారం నుంచి దిగగా, కొంతమంది ఎమర్జెన్సీ ద్వారం నుంచి, మరికొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు. బస్సు, టిప్పర్‌ డ్రైవర్లతోపాటు బస్సులోని మరో నలుగురు సజీవ దహనమయ్యారు. 29 మంది గాయాలతో బయటపడ్డారు. మృతిచెందిన వారిని బస్సు డ్రైవర్‌ అంజి (35), నీలాయపాలేనికి చెందిన ఉప్పుగుండూరు కాశీ బ్రహ్మేశ్వర రావు (64), ఆయన భార్య లక్ష్మీ (55), మనవరాలు ముప్పరాజు ఖ్యాతి శ్రీసాయి (8), గోనసపూడికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (52), మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ హరిసింగ్‌ (39)గా గుర్తించారు. గాయపడిన వారిలో 20 మందిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.

కొందరిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట నుంచి అగ్నిమాపకదళం వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా, సంఘటన ప్రదేశం పక్కనే చీరాల వాడరేవు - నకరికల్లు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణకు అవసరమైన గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. అయితే అక్కడ రోడ్డు పనులకు సంబంధించి ఎలాంటి ఇండికేషన్లూ లేవు. కాగా, ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

ఈ ప్రమాదంలో మృతిచెందిన బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దొప్పలపూడి భావన, ఆమె భర్త అనిల్‌ హైదరాబాదులో ఉంటున్నారు. వారికి సంతానం లేరు. రెండో కుమార్తె దుర్గ, భర్త ముప్పరాజ సుబ్బారావు ఒంగోలులో ఉంటున్నారు. వీరికి ఒకే ఒక కుమార్తె ఖ్యాతి శ్రీసాయి. బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి హైదరాబాద్‌ నుంచి ఓటు వేయడానికి వచ్చారు. వేసవి సెలవులు కావడంతో మనవరాలు సాయి కూడా వారివెంట హైదరాబాద్‌ బయల్దేరింది. కానీ, ప్రమాదంలో ఈ ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు భావన చిన్నారి శ్రీసాయిని వెంటబెట్టుకుని కిందకు దిగేందుకు మెయిన్‌ డోర్‌ వద్దకు వెళ్లారు. అయితే మెయిన్‌ డోర్‌ విరిగి లోపలికి పడడంతో సాధ్యం కాలేదు. అదే సమయంలో వెనకవైపు కిటికీ అద్దాలు పగలగొట్టి కిందకు దిగుతున్నట్లు తెలుసుకున్న భావన చిన్నారి చేయి పట్టుకుని అటువైపు వెళ్లింది. అయితే చిన్నారి భయాందోళనతో తాతయ్య వద్దకు వెళ్ళింది. అప్పటికే పరిస్థితి చేయి దాటి పోతుండడంతో బయటకు దిగిన ప్రయాణికులు భావనను బలవంతంగా కిటికీ నుంచి లాగేశారు. దీంతో ప్రాణాలతో బయటపడింది. బ్రహ్మేశ్వరావు, లక్ష్మీతో పాటు సాయి కూడా అగ్నికి ఆహుతైంది. భావన ప్రస్తుతం గుంటూరు రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ కుటుంబంలో ఉన్న ఏకైక సంతానం ఖ్యాతి మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు సజీవదహనం కావడంతో నీలాయపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలంలోనే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా భస్మం మాత్రమే మిగిలి ఉన్న దృశ్యాలు చూపరులను కంటతడిపెట్టించాయి. చిన్నారి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి మాంసం ముద్దగా పడి ఉండడం కలచివేసింది. ఘటనాస్థలానికి వచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆ దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధరాత్రి అక్కడకు వెళ్లి దగ్గరుండి బాధితులను ఆస్పత్రికి తరలించడంతో పాటు మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్‌ కనీస జాగ్రత్తులు పాటించకపోవడమే ఈ దారుణానికి కారణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ONG4.jpg

డ్రైవర్‌ను రెండుసార్లు హెచ్చరించా

సింగోతు సాయికుమార్‌, భాగ్యనగర్‌

చినగంజాంలో బస్సు బయల్దేరినప్పటి నుంచి నేను డ్రైవర్‌ ప్రక్కనే కూర్చుని ఉన్నా. పర్చూరు, చిలకలూరిపేట రహదారి మధ్య రెండుసార్లు బస్సు రోడ్డు మార్జిన్‌ దిగడం గమనించి డ్రైవర్‌ని హెచ్చిరించా. మరోసారి డ్రైవర్‌ని అప్రమత్తం చేసేలోపే ఘోరప్రమాదం జరిగింది. బస్సులో లైట్లు ఆరిపోవడం, మంటలు రావడం కనిపించింది. వెంటనే డ్రైవర్‌ క్యాబిన్‌కి, ప్రయాణికులకు మధ్య ఉన్న డోరు తీద్దామనుకుంటే లాక్‌ అయింది. లాక్‌ను తీసి ప్రయాణికులను దించివేయాలని చూసేలోగా మంటలు వ్యాపించాయి. కొంతమందిని ఈ డోరు ద్వారా బయటకు దించాను. కొంతమంది కిటికీ అద్దాలు పగలగొట్టుకొని వచ్చారు. అద్దాలలో ఇరుక్కున్న వారిని బయటకు లాగాను. వెంటనే 108, 101 లకు ఫోన్‌ చేశాను. బస్సులో చిక్కుకున్న ఆ నలుగురిని మాత్రం కాపాడలేకపోయాము.

షాక్‌కు గురయ్యా.. తాటి సాయిలక్ష్మీ, సోపిరాల

మేము చినగంజాంలో మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో బస్సెక్కాం. గంటసేపు ప్రయాణించగానే బస్సు ప్రమాదానికి గురికావడంతో షాక్‌కు గురయ్యాము. నిద్ర మత్తులో ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సులో మంటలు వ్యాపించాయి. బుధవారం హైదరాబాదులో నేను ఇంటర్వ్యూకి హాజరు కావలసిఉంది. భగవంతుని దయవలన ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో పడ్డాను.

ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి

టి.రాజ్యలక్ష్మి, మమత

బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయాము. బస్సులో మంటలు, బయట చిమ్మచీకటి. ఏమైందో తెలియలేదు, ప్రాణాలు దక్కించుకునేందుకు కొంతమంది కాలుతున్న ద్వారం గుండా అద్దాలు పగలకొట్టుకొని బయటకు దూకారు. తప్పించుకొని బయటకు వచ్చేలోపే కళ్ల ముందే బస్సు కాలిబూడిదైంది.

Updated Date - May 16 , 2024 | 04:50 AM