Share News

YS Jagan నిజమే.. ఏలేరు ఆధునికీకరణ చేపట్టలేదు

ABN , Publish Date - Sep 14 , 2024 | 05:26 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్‌ అంగీకరించారు.

YS Jagan నిజమే.. ఏలేరు ఆధునికీకరణ చేపట్టలేదు
YS Jagan

  • మా ప్రభుత్వం ఆ పనులు చేయలేదు

  • కాకినాడ జిల్లా పర్యటనలో జగన్‌ ఒప్పుకోలు

  • దానికి వింత సమర్థనలు.. పచ్చి అబద్ధాలు

  • ఆధునికీకరణ చేపడితే క్రాప్‌ హాలిడే ఇవ్వాలట

  • వర్షాలు, రిజర్వాయర్‌ నిండుగా ఉండడం వల్లే

  • ఐదేళ్లపాటూ పనులు చేయలేకపోయారట!

  • ఏలేరు ముంపు గ్రామాల్లో జగన్‌ షో

  • నీటిలో దిగకుండా రోడ్డుపైనే పరామర్శలు

  • వరద బాధితులతో పొడి పొడిగా మాటలు

  • ముంపు చూడాలని కోరినా పట్టించుకోని జగన్‌

  • బాణసంచా కాల్చిన వైసీపీ శ్రేణుల

  • తీరుపై బాధితుల ఆగ్రహం

కాకినాడ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్‌ అంగీకరించారు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరు ఉండడం వల్లే ఆ పనులు చేయలేకపోయినట్టు అడ్డగోలు వాద న వినిపించారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేయాలంటే క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతోనే పనులు చేయకుండా నాడు వదిలేశామని విచిత్ర సమర్థన వినిపించారు.


కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో శుక్రవారం జగన్‌ పర్యటించారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో గట్టు దాటి పొలంలోకి దిగని ఆయన.. పెద్దగా వరద ప్రభావం లేని ఏరియాల్లో మాత్రం హడావుడి చేశారు. నెత్తిన చేతులు ఉంచుతూ, ముద్దు లు పెడుతూ అక్కడ కనిపించిన ఆయన.. నిండా మునిగిన వరద బాధితులతో మాత్రం అంటీముట్టనట్టు ప్రవర్తించారు. అనంతరం యు.కొత్తపల్లి మం డలం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అడుగడుగునా అబద్ధాలు వల్లించారు. తన ప్రభుత్వ వైఫల్యాలను వింత సమర్థనతో డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు.

ఏలేరు ఆధునికీకరణ చేయకపోవడం వల్లే వరద కాకినాడ జిల్లాను చాలావరకు ముంచేయడానికి గత వైసీపీ పాలనే కారణమంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విజయవాడ, ఏలేరు వరదలు మ్యాన్‌మేడ్‌ (మానవ కల్పి త) వరదలంటూ అవగాహన లేని వ్యాఖ్యలు చేశారు.


ఏలేరును ‘రివర్స్‌’లో ముంచారు..

జగన్‌ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నాడు వాటిని రద్దు చేశారు. ఐదేళ్లూ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. అయితే ఈ తప్పిదాలన్నింటినీ జగన్‌ అడ్డగోలుగా సమర్థించుకుంటూ, కూటమి ప్రభుత్వంపై నిందలేయడానికి ప్రయత్నించారు. తన పాలనలో వర్షాలు సమృద్ధిగా పడడంతోకాలువల్లో 10 వేల క్యూసెక్కుల వరద నీరు వెళ్లే అవకాశం ఉన్నందువల్ల ఆధునీకరణ చేయలేదన్నారు. అలాగే జగన్‌ సీఎంగా ఉండగా పంటల బీమా పథకం ప్రీమియం సొమ్ములు చెల్లించకుండా ఎగ్గొట్టారు. కానీ అది చంద్రబాబు చెల్లించకపోవడం వల్లే 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు బీమా పరిహారం అందలేదని వరద ప్రాంతాల పర్యటనలో జగన్‌ బొంకారు. పంటనష్టాలను యాప్‌ సహాయంతో చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తుంటే, జగన్‌ మాత్రం అసలు ఇంకా నమోదు జరగలేదని అబద్ధాలాడారు. అదే సమయంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అక్కసును వెళ్లగక్కారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని, పవన్‌కల్యాణ్‌ సినిమా ఆర్టిస్ట్‌ అన్నారు.


ఇదేం పరామర్శ?!

వెళ్లింది వరద బాధితులను పరామర్శించి, పెను విపత్తు కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చడానికి! కానీ, జగన్‌ కాకినాడ జిల్లా పర్యటనలో ఇవేవీ కనిపించలేదు. బాధితులతో పెద్దగా మాట్లాడింది లేదు. కారుదిగి రెండడుగులు కూడా నడవకుండానే రోడ్లపైనే వారితో పొడి పొడిగా మాట్లాడి మమ అనిపించేశారు. ఏలేరు వరదకు అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం అతలాకుతలం కాగా.. నిరసనలు, నిలదీతల భయంతో ఆ మండలాన్ని కాదని ఆ పక్కనే ఓ మోస్తరు ముంపు ఉన్న పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో పర్యటించారు. వాస్తవానికి ఏలేరు వరద ముంపునకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో 2022 జూలైలో గొల్లప్రోలులో ఓ సభకు హాజరై ఏలేరు ఆధునీకరణ ఫేజ్‌1, ఫేజ్‌2 పనులకు రూ.292 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో ఏలేరు వరదల్లో 64 గ్రామాలు కకావికలమయ్యాయి. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే నిరసనలు వస్తాయనే భయంతో పెద్దగా నష్టం లేని పిఠాపురంలోని మాదాపురం, యు.కొత్తపల్లి మండలంలో పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జగన్‌ పర్యటించారు.


పైగా ఇందులో రెండు గ్రామాలు పూర్తిగా వైసీపీ ఆధిపత్యం ఉన్న, తన సామాజికవర్గం అధికంగా ఉన్న ప్రాంతాలు కావడం విశేషం. తొలుత మాదాపురం పరిధిలోని శివారులోని తమ ముంపు ప్రాంతాల్లోకి రావాలని స్థానిక వరద బాధితులు ఆహ్వానించగా జగన్‌ వెళ్లలేదు. బాధితులతో తన కారుపక్కనే నిలబడి పలకరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత దారిలో పలు కుగ్రామాలకు (హేమ్‌లెట్స్‌) వరద ముప్పు లేకపోయినా రోడ్డుపై ఆగి వారికి ముద్దులు కురిపించారు. తర్వాత రమణక్కపేటకు వెళ్లేసరికి వరద పారుతుండడంతో ట్రాక్టర్‌ ఎక్కి గ్రామంలోకి వెళ్లి బాధితులతో పొడిపొడిగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం లేకపోవడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. మరోపక్క జగన్‌ రాకతో కొందరు వైసీపీ శ్రేణులు నాగులాపల్లి, దారి మధ్యలో పలుచోట్ల బాణసంచా కాల్చడం విశేషం. అసలే బాఽధల్లో ఉన్న ప్రజలకు మధ్యకు వచ్చిన సమయంలో పార్టీ నేతలు బాణసంచా కాల్చి ఆనందాలు జరపడంపై జగన్‌ తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Also Read:

ఇంకా జగన్‌ జపమేనా

బంగారం, వెండి ధరలు భారీగా జంప్.. ఎంతకు చేరాయంటే

అందరికీ సాయం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 14 , 2024 | 06:58 AM