TTD Chairman : తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు సహించం
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:19 AM
: తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు..
సోషల్ మీడియా ద్వారా హెచ్చరించిన టీటీడీ చైర్మన్
తెలంగాణ నేతపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి
తిరుమల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. తిరుమలలో తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల విషయంలో భేదం చూపిస్తున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ గురువారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో టీటీడీ చైర్మన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో గురువారం అర్ధరాత్రి ఓ పోస్ట్ చేశారు. ‘ తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా బోర్డు తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదేలేదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆయనపై చర్యలకు ఆదేశిస్తున్నాం’ అంటూ పేర్కొన్నారు.