తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల కోటా పెంపు
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:51 AM
తిరుపతి విమానాశ్రయంలో రోజూ జారీ చేస్తున్న శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను టీటీడీ పెంచింది.
తిరుమల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుపతి విమానాశ్రయంలో రోజూ జారీ చేస్తున్న శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. గతంలో ఇచ్చే వంద టికెట్లను 200కు పెంచారు. విమానాశ్రయంలోని కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇక, తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుకభాగంలో ఉన్న శ్రీవాణి టికెట్ల కౌంటర్‌లో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800కు తగ్గించారు. ఈ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.
25న రూ.300 దర్శన టికెట్లు విడుదల
ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఈ కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’ ద్వారా విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో ఖాళీలను కూడా విడుదల చేస్తారు. మరోవైపు 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు జారీ చేయనున్నారు.